రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం 'బ్రహ్మాస్త్రం'. నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్‌మీట్ నిర్వహించింది. చిత్ర బృందంతోపాటు ప్రముఖ నటుడు ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు.
పోలీసుల మాట వినటం మన ధర్మం
Brahmastra event cancelled: శుక్రవారం సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదాపై ఎన్టీఆర్ మాట్లాడుతూ.. "ఈవెంట్ వేదికకు వచ్చిన, రావాలనుకున్న నా అభిమానులకు ముందుగా క్షమాపణలు. మీరు వేడుకకు రాకపోయినా మంచి చిత్రాలను, నన్ను ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మీడియానూ క్షమాపణలు కోరుకుతున్నా. వినాయక విగ్రహ నిమజ్జనాల నేపథ్యంలో అధిక బందోబస్తును ఏర్పాటు చేయలేమని పోలీసు డిపార్ట్‌మెంట్ చెప్పింది. పోలీసులు ఉండేది మన భద్రత కోసం.. వారు చెప్పింది వినటం మన ధర్మం. అందుకే వారికి సహకరించి మేం ఇలా చిన్న వేదికపై నుంచి మీతో మాట్లాడుతున్నాం. నేను చాలా మంది నటులను ఇష్టపడతా. అమితాబ్ బచ్చన్ ప్రభావం ఓ నటుడిగా నాపై చాలా ఉంది. ఆయనకు నేను వీరాభిమానిని. ఆ తర్వాత నేనంతగా ఇష్టపడేది రణ్‌బీర్‌నే. అతనితో కలిసి ఈ వేదికను పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన రాజమౌళికి ధన్యవాదాలు. అలియా, అయాన్.. చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. తెలుగు నటుడు హిందీ సినిమాలో నటించి, హిందీ మాట్లాడితే ఎలా ఉంటుందనేది నాగార్జున బాబాయ్ 'ఖుదా గవా' చూసి తెలుసుకున్నా. 'బ్రహ్మాస్త్రం'లోనూ ఆయన హిందీ మాట్లాడారనుకుంటున్నా. అంతర్జాతీయ స్థాయిలో చిత్ర పరిశ్రమ ఒత్తిడికి లోనవుతోంది. ప్రేక్షకుడికి ఇప్పుడు మనం ఇస్తున్నదానికంటే కొత్తది ఇంకేదో కావాలి. ఒత్తిడిలోనే బాగా పనిచేస్తామని నేను నమ్ముతాను. ఈ ఛాలెంజ్‌ని ఇండస్ట్రీ స్వీకరించాలి. నేను ఎవరినీ తక్కువ చేసి మాట్లాడటం లేదు. ప్రేక్షకులకు మంచి కథలను అందించేందుకు ప్రయత్నిద్దాం. మరిన్ని గొప్ప చిత్రాలు చేద్దాం" అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.