Bobby Deol Role In Animal Movie :'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగ, బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'యానిమల్'. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ మూవీపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఓ కీలక పాత్ర పోషించారు. అయితే ఇటీవల జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఈ పాత్రకు తాను ఎంపికైన విధానాన్ని ఫన్నీగా చెప్పారు బాబీ.
తాను పని లేకుండా (జాబ్ లెస్) ఖాళీగా ఉన్న సమయంలో యానిమల్ సినిమా ఆఫర్ వచ్చిందని చెప్పారు. అప్పుడున్న పరిస్థితుల్లో తన కెరీర్లో ఇలాంటి గొప్ప పాత్ర చేస్తానని తాను అస్సలు అనుకోలేదని తెలిపారు. అలాంటి సమయంలో దర్శకుడు సందీప్ వంగ నుంచి కాల్ వచ్చిందన్నారు. ఆ తర్వాత కథ చెప్పేటప్పుడు తాను సెలెబ్రిటీ క్రికెట్ లీగ్- సీసీఎల్‌లో ఆడుతున్న సమయంలో దీర్ఘంగా ఆకాశం వైపు చూస్తున్న ఒక ఫొటోను.. దర్శకుడు సందీప్ తనకు చూపించారని చెప్పారు. ఆ ఫొటోలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సందీప్‌కు నచ్చి.. అతడి సినిమాలో పాత్రకు తానే ఫిట్ అవుతానని అనుకున్నాడని తెలిపారు.
"నేను సీసీఎల్ ఆడుతున్నప్పటి ఓ ఫొటోను సందీప్ నాకు చూపించారు. ఆ సమయంలో అంతగా సినిమాలు చేయడం లేదు. ఆ ఫొటోలో నేను ఆకాశం వైపు చూస్తున్నాను. అది చూసి సందీప్.. 'ఈ ఎక్స్ప్రెషన్ కారణంగానే మిమ్మల్ని సినిమాలోకి తీసుకుంటున్నాను. సినిమాలో నాకు కావాల్సిందిదే' అని చెప్పాడు. పని లేని రోజులు నాకు పనికి వచ్చాయని నేను ఓకే చెప్పాను."
-- బాబీ డియోల్, బాలీవుడ్ నటుడు.