Bobby Deol Hari Hara Veera Mallu Dialogue :ఈ మధ్య బాలీవుడ్ వింటేజ్ స్టార్లు దక్షిణాది సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే సైఫ్ అలీఖాన్, సంజయ్ దత్ వంటి నటులు విలన్ పాత్రల్లో మెరిశారు. తాజాగా మరో బీ-టౌన్ స్టార్ యాక్టర్ బాబీ దెఓల్ కూడా ఆ లిస్ట్‌లో చేరిపోయారు. తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ- బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కాంబోలో తెరకెక్కిన 'యానిమల్' సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ నటుడు తాజాగా చెప్పిన ఓ డైలాగ్ ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఇదీ జరిగింది..
ప్రస్తుతం బాబీ దేవోల్.. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు'లో నటిస్తున్నారు. దీంతో పాటు తమిళ హీరో సూర్య నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'కంగువా'లోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటితో పాటు బాలకృష్ణ సినిమాలోనూ బాబీ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన 'యానిమల్' ప్రీ రిలీజ్ వేడుకలో బాబీ దేఓల్ మాట్లాడారు. ఈ సందర్భంగా.. "నేను తెలుగులో ఓ సినిమా చేస్తున్నాను. అందులోని ఓ డైలాగ్ నాకు గుర్తుంది. 'బాద్షా బేగం మా ప్రాణం. మా ప్రాణాన్ని కాపాడడం కోసం మీకేం కావాలో కోరుకోమని ఆదేశిస్తున్నా'' అనే డైలాగ్ చెప్పారు.
అయితే బాబీ తెలుగులో చేస్తున్న సినిమాల్లో ఆయన తాజాగా చెప్పిన డైలాగ్ 'హరిహర వీరమల్లు' సినిమాకు చాలా దగ్గరగా ఉంది. దీంతో ఈ డైలాగ్ పవన్ కల్యాణ్ సినిమాలోదే అని కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు కూడా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో సాగే చిత్రమే కావడం వల్ల అభిమానుల వాదనకు బలం చేకూర్చినట్లు అయింది.