తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Bichagadu 2 Review : విజయ్​ ఆంటోనీ 'బిచ్చగాడు-2' ఎలా ఉందంటే? - బిచ్చగాడు 2 రివ్యూ

Bichagadu 2 Review : విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన చిత్రం బిచ్చగాడు-2.. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే?

Bichagadu 2 Review
Bichagadu 2 Review

By

Published : May 19, 2023, 2:58 PM IST

Bichagadu 2 Review : 'నకిలీ' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల పరిచయ్యారు హీరో విజయ్ అంటోనీ. 'సలీమ్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన 'బిచ్చగాడు' తెలుగులో ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి విజయ్‌ నటించిన ప్రతి తమిళ చిత్రం తెలుగులో విడుదలవుతూనే ఉంది. అయితే, 'బిచ్చగాడు' స్థాయి విజయాన్ని ఇప్పటివరకు ఆయన అందుకోలేకపోయారు. ఈ క్రమంలోనే 'బిచ్చగాడు 2'తో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు విజయ్ ఆంటోనీ. మరి ఇంతకీ ఈ బిచ్చగాడి కథేంటి? విజయ్‌ ఆంటోనీ ఎలా నటించారు? ప్రేక్షకులను సినిమా అలరించిందో? లేదో? ఓ సారి తెలుసుకుందాం.

బిచ్చగాడు 2

ఇదీ స్టోరీ..
Bichagadu 2 Movie Story : వి.జి.గ్రూప్‌ వ్యాపార సంస్థలకు అధిపతి విజయ్‌ గురుమూర్తి (విజయ్‌ ఆంటోని). దేశంలోనే ఆయన 7వ అత్యంత ధనవంతుడు. అతని ఆస్తి కొట్టేయాలని స్నేహితుడు అరవింద్‌ (దేవ్‌ గిల్‌) అదే సంస్థలో పని చేస్తున్న మరికొందరు మిత్రులతో కలిసి కుట్ర పన్నుతాడు. అందుకోసం విజయ్‌ మెదడు మార్పిడి ప్రయోగం చేయాలని నిర్ణయించుకుంటాడు. రూ.140 కోట్లు ఖర్చు చేసి సత్య (విజయ్‌ ఆంటోని) అనే బిచ్చగాడి మెదడును గురుమూర్తి తలలో అమర్చుతాడు. అయితే సత్యది మరో కథ. అతనికి రాణి అనే చెల్లి ఉంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే ఆదుకునే వాళ్లు లేక వీరిద్దరూ రోడ్డున పడతారు. అదే సమయంలో ఓ వ్యక్తి చేసిన మోసం వల్ల తన చెల్లి తప్పిపోతుంది. ఆమె కోసం వెతుకున్న సమయంలోనే అనుకోకుండా అరవింద్‌ కుట్రకు బలైపోతాడు. మరి సత్య మెదడు విజయ్‌ గురుమూర్తికి అమర్చాక ఏం జరిగింది? అతనిని అడ్డం పెట్టుకొని విజయ్‌ ఆస్తి దక్కించుకోవాలనుకున్న అరవింద్‌కు సత్య ఎలా బుద్ధి చెప్పాడు? తప్పిపోయిన తన చెల్లిని కనిపెట్టేందుకు ఏం చేశాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? పేద ప్రజల కోసం మొదలు పెట్టిన యాంటీ బికిలీ మాల్‌ ఏమైంది? దాని విషయంలో ఎదురైన రాజకీయ సవాళ్లను ఎలా అధిగమించాడు? తెలియాలంటే 'బిచ్చగాడు 2' సినిమా చూడాల్సిందే!

బిచ్చగాడు 2

ఎవరెలా చేశారంటే?
Bichagadu 2 Vijay Antony : నటుడిగా విజయ్‌ ఆంటోని ప్రతిభ గురించి కొత్తగా మాట్లాడుకునే పనిలేదు. నటన పరంగా తన పాత్రను అవలీలగా చేసుకుంటూ వెళ్లిపోయారు. ముఖ్యంగా పతాక సన్నివేేశాల్లో భావోద్వేగభరితమైన నటనతో కంటతడి పెట్టిస్తారు. ఇక దర్శకుడిగా ఇది ఆయనకు తొలి చిత్రమే అయినా ఆ ప్రభావం తెరపై ఎక్కడా కనిపించదు. మంచి అనుభవమున్న దర్శకుడిలా తెరపై ప్రతిభ చూపించాడు. రాసుకున్న కథలో చాలా లోపాలున్నా.. మాస్‌ ఎలిమెంట్స్, ఎమోషన్స్‌ మూమెంట్స్‌ వాటిని మర్చిపోయేలా చేస్తాయి. ద్వితీయార్ధాన్ని మరింత పగడ్బందీగా తీర్చిదిద్దుకొని ఉంటే సినిమా మరోస్థాయిలో ఉండేది.

సంగీత పరంగానూ ఈ చిత్రానికి విజయ్‌ తన వంతు న్యాయం చేశారు. చాలా సన్నివేశాల్లో తన నేపథ్య సంగీతంతో హీరోయిజాన్ని ఆకట్టుకునేలా ఎలివేట్‌ చేయగలిగారు. పాటలు మాత్రం పూర్తిగా తేలిపోయాయి. ఏ ఒక్కటీ గుర్తుంచుకునేలా ఉండదు. కావ్య థాపర్‌ అందంగా కనిపించింది. నటన పరంగా ఆమెకు కొత్తగా చూపించే ఆస్కారం ఏమీ దొరకలేదు. దేవ్‌ గిల్, రాధా రవి, జాన్‌ విజయ్, హరీష్‌ పేరడి తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి. యోగిబాబు కామెడీ సరిగా పండలేదు. ఛాయాగ్రహణం చిత్రానికి అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

  • బలాలు
  • + విజయ్‌ నటన
  • + యాక్షన్, ఎమోషన్స్‌
  • + పతాక సన్నివేశాల
  • బలహీనతలు
  • - కథనం సాగిన తీరు
  • - ద్వితీయార్ధం
  • చివరిగా: మాస్‌ ప్రేక్షకులు మెచ్చే 'బిచ్చగాడు'
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details