Bhola Shankar Pre Release Event : మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ మెహర్ రమేశ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం భోళాశంకర్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు మూవీమేకర్స్. ఈ ఈవెంట్‌కు పలువురు టాలీవుడ్ దర్శకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. రీమేక్ సినిమాలు చేయడంలో తప్పే లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
'భోళా శంకర్'.. తమిళ సినిమా 'వేదాలం'కు రీమేక్. ఇప్పుడు 'వేదాలం' సినిమా ఏ ఓటీటీలోనూ అందుబాటులో లేదు. చాలా మంది ఇప్పటికీ ఈ సినిమా చూసి ఉండరు. అందుకే ధైర్యంగా ఈ సినిమా చేశాను. ఈ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుంది. షూటింగ్ జరుగుతున్నప్పుడు.. ఈ సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకం అందరిలో కనిపించింది. భోళా శంకర్‌లో నేను కనిపించను. తమ్ముడు పవన్ కల్యాణ్ కనిపిస్తాడు. ఆడియెన్స్‌కు అది కనులపండుగగా ఉంటుంది. ఇందులో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ బాగుంటుంది. కీర్తి సురేశ్ కూడా బాగా నటించారు. నన్ను ప్రోత్సహంచి ఈ స్థాయిలో నిలబెట్టిన ఫ్యాన్స్‌కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా" అని మెగాస్టార్ అన్నారు.
"కేవలం స్టార్స్ మాత్రమే ఉన్న ఇండస్ట్రీలోకి బిక్కుబిక్కుమనుకుంటూ ప్రవేశించా. కానీ, ఇక్కడ రాణిస్తాననే నమ్మకం గట్టిగా ఉండేది. ‘కొత్త అల్లుడు’లో ఓ చిన్న పాత్ర పోషించమన్నారు. బాధతోనే నటించా. ‘కొత్తపేట రౌడీ’లో కృష్ణగారి పక్కన చిన్న వేషం వెయ్యవయ్యా’ అని అనేవారు. ఓ వైపు నేను ‘ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య’, ‘శుభలేఖ’ చేస్తున్నానని, వేరే సినిమాల్లో చిన్న పాత్రలు పోషిస్తే బాగోదేమోనన్న సందేహం వెలిబుచ్చా. ‘చేయండి సర్’ అంటూ గంభీర స్వరంతో సమాధానమిచ్చేవారు. చెయ్యను అని చెబితే భవిష్యత్తుపై ప్రభావం పడుతుందేమోననే భయంతో చేశా. నన్ను ప్రోత్సహించి, భుజానికెత్తుకుంది ప్రేక్షకులు. ఇండస్ట్రీకి చెందిన వారు నాకు సెకండరీ" అని చిరంజీవి భావోద్వేగంగా మాట్లాడారు.
ఈ వేడుకకు హాజరైన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. అందరూ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగితే.. నేను మాత్రం ఆయనతో సినిమాలు చేస్తూ పెరిగా. ఆయనంటే నాకెంతో ఇష్టం. ఒకరు ఆయన గురించి తప్పుగా మాట్లాడినందుకు.. 12 ఏళ్లు పోరాడి వారికి శిక్ష పడేదాకా నేను ఊరుకోలేదు" అని అన్నారు.
కాగా ఈ సినిమాలో అక్కినేని సుశాంత్ కీలక పాత్ర పోషించారు. నటి కీర్తి సురేశ్.. చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించగా.. తమన్నా భాటియా మెగాస్టార్‌తో జత కట్టారు. 'భోళా శంకర్'ను దర్శకుడు మెహర్ రమేశ్ తమిళ సినిమా 'వేదలం'ను రీమేక్ చేసి తెలుగులో తెరకెక్కించారు. ఏ కే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామారావు ఈ సినిమాను నిర్మించారు. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.