Bhola Shankar Poster : మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' తర్వాత చేస్తున్న సినిమా 'భోళా శంకర్'. ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన కొన్ని స్టిల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మే డే సందర్భంగా కార్మికులు, కర్షకులు, శ్రమ జీవులకు 'భోళా శంకర్' టీమ్ శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా ఈ పోస్టర్లలో మెగాస్టార్.. ఒక టాక్సీ డ్రైవర్‌గా కనిపించాడు. కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌ని సూచిస్తూబ్లూ యూనిఫాంలో ఉన్న చిరు స్టైలిష్ లుక్స్.. అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే 80 శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ముందుగా ప్రకటించినట్లుగానే ఆగస్టు 11 న థియేటర్లలో సందడి చేయనున్నట్లు స్పష్టం చేశారు చిత్ర నిర్మాతలు. తమిళంలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన 'వేదాళం' చిత్రానికి తెలుగు రీమేక్‌గా 'భోళా శంకర్' రూపొందుతోంది. ఈ కథ.. అన్నాచెల్లెళ్ల అనుబంధాల నేపథ్యంలో ఉండనుంది. డైరెక్టర్ మెహర్ రమేశ్ కథలో స్వల్ప మార్పులతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు. లేటెస్ట్ పోస్టర్ల ఆధారంగా చిరు ఈ సినిమాలో మాస్, స్టైలిష్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.