Bhola Shankar Movie : వాల్తేరు వీరయ్య తర్వాత టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళాశంకర్. తమన్నా కథానాయికగా, కీర్తి సురేశ్ హీరో చెల్లెలుగా నటించిన ఈ చిత్రం.. ఆగస్టు 11వ తేదీని థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే ట్రైలర్ విడుదల అవ్వగా.. మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాతో టాలీవుడ్లోకి ఛాయగ్రాహకుడు డడ్లీ అడుగుపెట్టారు. త్వరలో సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా ఆయన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. అవి ఆయన మాటల్లోనే..
మహేశ్, అల్లు అర్జున్, సమంతతో..
Bhola Shankar Movie Cinematographer : "తెలుగులో టాలీవుడ్ స్టార్లు మహేశ్‌బాబు, అల్లు అర్జున్, సమంతతో వాణిజ్య ప్రకటనల్ని తెరకెక్కించాను. కానీ తెలుగు సినిమా మాత్రం చేయలేదు. దర్శకుడు మెహర్ రమేశ్ నాకు పదేళ్లుగా మంచి స్నేహితుడు. తను ఎప్పుడు ముంబయి వచ్చినా నన్ను కలుస్తుంటారు. నేను హైదరాబాద్‌కు వచ్చినా ఆయనను కలుస్తుంటా. లాక్‌డౌన్ సమయంలోనే తను ఫోన్ చేసి మనం ఓ సినిమా చేస్తున్నాం... 'హీరో ఎవరో చెప్పుకో చూద్దాం' అన్నారు. నేను కొంతమంది పేర్లు చెప్పా. తను కాదు అన్నాడు. ఆ తర్వాత తనే చిరంజీవి అని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. ఆ తర్వాత థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఆ తర్వాత మెహర్ రమేశ్ ముంబయి వచ్చి ప్రాజెక్ట్ వివరాలు చెప్పాడు. అలా మొదలైందే భోళాశంకర్ ప్రయాణం."
హిందీ పరిశ్రమ కన్నా ఇక్కడే..
Bhola Shankar Movie Chiranjeevi Role : హిందీ పరిశ్రమతో పోలిస్తే ఇక్కడ సమయపాలన ఎక్కువని.. వృత్తి పరంగా చాలా నిబద్ధతతో ఉంటారని డడ్లీ తెలిపారు. "చిరంజీవి సర్ ఉదయం ఏడు అంటే ఏడింటికే మేకప్‌తో కెమెరా ముందు సిద్ధంగా ఉంటారు. కార్‌వ్యాన్‌లోకి కూడా వెళ్లరు. ఆయనొక ఎన్‌సైక్లోపీడియా. నలభయ్యేళ్ల అనుభవం ఆయన వెనక ఉంది. సెట్లో చాలా విషయాలు చెబుతుంటారు. రోజూ ఏదో ఒక కొత్త అంశం ఆయన్నుంచి నేర్చుకుంటూనే ఉంటాను. ఈ సినిమాకు ఆయన స్టైల్... ఇమేజే హైలెట్. కామెడీ టైమింగ్, పోరాట ఘట్టాలు ప్రేక్షకులకు కనువిందుగా ఉంటాయి. గ్యాంగ్‌స్టర్ సినిమాకు శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ చిత్రం. ఒకప్పటి చిరంజీవిని ఇందులో చూస్తారు. ఆయన యువకుడిలా కనిపించడమే ఈ సినిమా ప్రత్యేకత" అంటూ చెప్పుకొచ్చారు.
రెండు నెలల తర్వాత..
Bhola Shankar Movie Dudley : భోళాశంకర్ రీమేక్ చిత్రమే అయినా.. వేదాలంకి పూర్తి భిన్నంగా ఉంటుందని డడ్లీ తెలిపారు. రీమేక్ చేయడం కష్టమా సులభమా అనడం కంటే.. ఇదొక సవాల్ అని.. అందుకే విజువల్ పరంగానే కాకుండా.. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుని పనిచేశామని చెప్పారు. ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైన్, రామ్ లక్ష్మణ్ స్టంట్స్ డిజైన్ చాలా బాగుంటాయని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోనే కాదు.. కోల్‌కతాకి వెళ్లినా, స్విట్జర్లాండ్‌లో అయినా ఏం కావాలో అవి పక్కాగా సమకూర్చారని వివరించారు. భోళాశంకర్ తర్వాత తెలుగులో కొత్తగా ఏదీ ఒప్పుకోలేదని.. రెండు నెలలు విరామం తర్వాత కొత్తసినిమాల గురించి ఆలోచిస్తానని వెల్లడించారు.