బిహార్‌కు చెందిన ప్రముఖ భోజ్‌పురి జానపద గాయని నిషా ఉపాధ్యాయ్‌కు లైవ్ జరగుతున్న సమయంలో చేదు అనుభవం ఎదురైంది. ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమెపై ఓ గుర్తుతెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఆమె స్టేజీపైనే కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న కొందరు స్థానికులు ఆమెను పట్నాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని.. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. సరన్ జిల్లా జనతా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెందుర్వ గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం వల్ల పోలీసులు స్పందించారు.
ఈ ఘటనకు సంబంధించి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని.. తాము కూడా సామాజిక మాధ్యమాల ద్వారానే తెలుసుకున్నామని జనతా బజార్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ నస్రుద్దీన్ ఖాన్ వెల్లడించారు. నిషా ఉపాధ్యాయ్ వేదికపై పాట పాడుతుండగా అక్కడే ఉన్న ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై గన్‌తో కాల్పులు జరపగా.. ఆమె ఎడమ తొడకు గాయాలయ్యాయని ఆయన తెలిపారు. అయితే ఈ ఘటనపై నిషా ఉపాధ్యాయ్ కుటుంబ సభ్యులు మాత్రం స్పందించేందుకు విముఖత చూపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్పులు జరిపింది ఎవరు? అసలు ఆమెను ఎందుకు గాయపరిచారన్న కోణాల్లో విచారణ ప్రారంభించారు.