Sri Vishnu: తెలుగు టైటిల్స్ అంటే ఇష్టమని, అందుకే తన సినిమాలకు అలాగే పెడతానని అన్నారు యంగ్ హీరో శ్రీవిష్ణు. ‘బ్రోచేవారెవరురా’, ‘రాజ రాజ చోర’, ‘అర్జున ఫల్గుణ’ సినిమాల పేర్లు కూడా అలా పెట్టినవే అన్నారు. కొత్త సినిమాకు ‘భళా తందనాన’ అని తెలుగు టైటిల్‌ను ఎంచుకున్నానంటూ చెప్పుకొచ్చారు. ఈ సంవత్సరం సెన్సేషనల్ సినిమాలతో అలరింబోతున్నట్లు పేర్కొన్నాడు. ఇంకా ఈ హీరో చెప్పిన ‘భళా తందనాన’ ముచ్చట్లు చూద్దాం.
ఈ సినిమాలో ప్రేక్షకులకు కొత్తగా ఏం చూపించబోతున్నారు?
శ్రీవిష్ణు:క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే కూడా బాగుంది. మంచి ట్విస్ట్‌లు ఉన్నాయి. మ్యూజిక్ మణిశర్మ అందించారు. కొంతమంది ఆడియన్స్ సౌండ్స్‌ని ఇష్టపడతారు. మణిశర్మ ఈ సినిమాకు మంచి పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.
‘భళా తందనాన’ అనే పేరే ఎందుకు పెట్టారు?
శ్రీవిష్ణు:అన్నమాచార్య రాసిన అన్ని సంకీర్తనలు దేవుడి గురించే రాశారు. ‘భళా తందనాన’ మాత్రం మనుషుల మధ్య వ్యత్యాసాలు ఉండకూడదు, మనుషులు అందరు సమానమే అన్నట్లు ఉంటుంది. అది మా సినిమా కథకు సరిపోతుంది. అందుకే ఈ టైటిల్ పెట్టాము. వ్యక్తిగతంగా కూడా నాకు తెలుగు టైటిల్స్ అంటే ఇష్టం.
ఈ సినిమాలో మీ పాత్ర గురించి వివరించండి?
శ్రీవిష్ణు:ఈ సినిమాలో నేను ఒక సామాన్యమైన వ్యక్తిని. హీరోయిన్ జర్నలిస్ట్. ఒక జర్నలిస్ట్‌తో కలిసి కామన్ మ్యాన్ చేసిన సాహసాలు, ప్రజలు కోసం వాళ్లేమి చేశారన్నది కథ. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో చాలా వరకు మాస్ లుక్ లోనే కనిపించాను. ఈ సినిమాలో చాలా విభిన్నమైన పాత్ర నాది. ఒక కలానికి, కత్తికి జరిగే పోరాటమే ఈ ‘భళా తందనాన’ సినిమా.