Bhagvant Kesari Sequel : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం భగవంత్ కేసరి. కాజల్ అగర్వాల్, శ్రీలీల కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా రీసెంట్గా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. విశేష స్పందన దక్కుతోంది. దీంతో మూవీటీమ్.. హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించింది. నిర్మాత దిల్ రాజు, దర్శకురాలు నందిని రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సినిమా విజయంపై హర్షం వ్యక్తం చేశారు. "నాతో కలిసి పనిచేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ధైర్యం నాకు లేదు. ఈ బరువు మోసినందుకే చాలా నలిగిపోయాను. సీక్వెల్ తీయగలిగే శక్తిని బాలకృష్ణ నాకిస్తే వెంటనే తీస్తాను" అని అన్నారు. ఇంకా సినిమా గురించి పలు విషయాలను చెప్పుకొచ్చారు.
ఇదే ఈవెంట్లో దిల్‌రాజు మాట్లాడుతూ.. "మా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో అనిల్ రావిపూడి ఇప్పటికే 5 చిత్రాలు చేశారు. భగవంత్ కేసరి గురించి నాకు ఎప్పుడో చెప్పారు. తెలంగాణ యాసలో బాలయ్య సంభాషణలు చెబితే చాలా కొత్తగా ఉంటుందని అన్నాను. మొదటి నుంచీ బ్రో ఐ డోంట్ కేర్ టైటిల్ అనుకున్నాడు. ఆ తర్వాత భగవంత్ కేసరిగా మార్చాడు. ఎప్పుడూ ఎంటర్టైనింగ్ సినిమాలు చేసే అనిల్.. ఇలాంటి బలమైన కథను రాయడం గొప్ప విషయం అని చెప్పాలి. యాక్టర్‌గా శ్రీలీలకు మంచి ఫ్యూచర్ ఉంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు వరకు శ్రీలీల అంటే డ్యాన్స్ అని మాత్రమే అనేవారు. కానీ, ఈ చిత్రంలో ఆమె యాక్టింగ్ జయసుధ, జయప్రద, శ్రీదేవిలను గుర్తు చేసింది. బాలయ్య డెడికేషన్‌తో నటించారు. ఇది లాంగ్రన్ ఫిల్మ్" అని దిల్ రాజు పేర్కొన్నారు.