Bhagavanth Kesari Movie Review : చిత్రం: భగవంత్ కేసరి; నటీనటులు: బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, ప్రియాంక జవాల్కర్, అర్జున్ రాంపాల్, ఆర్.శరత్‌కుమార్, జాన్ విజయ్, రఘుబాబు, వీటీవీ గణేష్ తదితరులు; సినిమాటోగ్రఫీ: సి.రామ్ ప్రసాద్; సంగీతం: ఎస్. తమన్; ఎడిటింగ్: తమ్మిరాజు; రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి; నిర్మాత: సాహు గారపాటి, హరీశ్ పెద్ది; బ్యానర్: షైన్ స్క్రీన్స్; విడుదల: 19-10-2023
జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాలకు సిద్ధమే అంటారు టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ. థియేటర్లలోకి ఆయన సినిమా వస్తుందంటే ఇక అభిమానులకు పండగే. మరోవైపు కామెడీని యాక్షన్‌తో రంగరించి కథను నడిపించడంలో అనిల్ రావిపూడికి ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. ఇక ఈ ఇద్దరి కాంబోలో మూవీ అంటే ఆడియెన్స్‌లో భారీ అంచనాలు ఉంటాయి. దీనికి తగినట్లుగానే 'భగవంత్ కేసరి' అంటూ ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి గురువారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది?
స్టోరీ ఏంటంటే.. నేలకొండ భగవంత్ కేసరి (బాలకృష్ణ) అడవి బిడ్డ. ఓ కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో జైలర్ (శరత్‌కుమార్) కూతురు విజయలక్ష్మి అలియాస్ విజ్జి పాప (శ్రీలీల)తో ఆయనకు అనుబంధం ఏర్పడుతుంది. విజ్జిపాపని ఆర్మీలో చేర్చాలనేది తన తండ్రి కల. అనుకోకుండా జైలర్ మరణించడం వల్ల విజ్జిపాప బాధ్యతలను భగవంత్ కేసరి తీసుకుంటారు. ఆమెని ఓ సింహంలా తయారు చేయాలని అనుకుంటారు. ఆ ప్రయత్నం ఎలా సాగింది? సైకాలజిస్ట్ కాత్యాయని (కాజల్) ఎలా సాయం చేసింది? ఇంతకీ భగవంత్ కేసరి జైలుకి ఎందుకు వెళ్లారు?ఆయన గతమేమిటి?రాజకీయ నాయకుల్ని తన గుప్పెట్లో పెట్టుకుని ప్రాజెక్ట్ వి కోసం ప్రయత్నాలు చేస్తున్న బిలియనీర్ రాహుల్ సాంఘ్వీ (అర్జున్ రాంపాల్)తో ఉన్న వైరం ఏమిటనేది మిగతా కథ.
సినిమా ఎలా ఉందంటే : టాప్ హీరోలతో సినిమా అనగానే దర్శకులు చాలా వరకు సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తుంటారు. ఆ హీరోల తాలూకు ఇమేజ్‌ని వాడుకుంటూ అభిమానుల్ని మెప్పిస్తే చాలు అని అనుకుంటుంటారు. కానీ, యువ దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం అందుకు భిన్నంగా ఈ సినిమాము తెరకెక్కించారు. ఆడబిడ్డని సింహంలా తయారు చేయాలి అనే విషయాన్ని బాలకృష్ణ లాంటి ఓ స్టార్ హీరోతో చెప్పించారు. నేటి సమాజానికి చాలా అవసరమైన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వంటి కీలకమైన అంశాన్ని స్పృశిస్తూ శక్తిమంతమైన సినిమా మాధ్యమం బాధ్యతని చాటి చెప్పారు. ఇలాంటి విషయాలు స్టార్ హీరోల సినిమాలతో చర్చకొస్తే ఆ ప్రభావం మరింత వేరుగా ఉంటుంది. ఆ విషయంలో హీరో బాలకృష్ణని అభినందించాల్సిందే. అలాగని ఈ సినిమా సందేశాలకే పరిమితం కాలేదు. అభిమానుల్ని, కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించే హీరోయిజంతో పాటు ఎమోషన్స్‌ను జోడించి వినోదాన్ని కూడా పంచుతుంది. అయితే కథలో లీనం చేయడానికి కాస్త సమయం తీసుకున్నారు దర్శకుడు. బాలకృష్ణ, శ్రీలీల కలిసినప్పట్నుంచి కథలో వేగం పెరుగుతుంది. చిచ్చా, బిడ్డా అంటూ ఆ ఇద్దరూ కలిసి చేసిన సందడి సినిమాకి హైలైట్.
Bhagavanth Kesari Movie Telugu Review : సైకాలజిస్ట్ కాత్యాయని, భగవంత్ కేసరి మధ్య జరిగే సన్నివేశాలతో ప్రథమార్ధం సరదాగా సాగుతుంది. కాలేజీలో విజ్జిపాపని భయపెట్టే సన్నివేశం నుంచి స్టోరీ మరింత జోరందుకుంటుంది. ఫ్యామిలీ నేపథ్యంతో మెదలైన ఈ సినిమా.. ఆ తర్వాత యాక్షన్ డోస్‌ను పెంచుకుంటూ వెళ్తుంది. అడవిలో ఊచకోత గురించి చెప్పే సన్నివేశాలు, ఇంటర్వెల్లో వచ్చే పోరాట ఘట్టాలు ద్వితీయార్ధంపై మరింత ఆసక్తిని పెంచుతాయి. భగవంత్ కేసరికీ, విజ్జిపాపకీ మధ్య జరిగే ఎమోషన్ సీన్స్ ద్వితీయార్ధానికి ప్రధానబలం. అప్పటికే చెప్పాల్సిన కథంతా పూర్తయినప్పటికీ.. తండ్రీ కూతుళ్ల బంధం చుట్టూ సన్నివేశాల్ని మలిచి మిగిలిన సినిమాని నడిపించారు దర్శకుడు. ద్వితీయార్ధంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పించిన అంశాలు కీలకం. 'మా అడవిలో మృగాలు ఉంటాయని బోర్డ్ రాసి ఉంటుంది. కానీ, సమాజంలో అలా కాదు.. ఆవుల్లా కనిపించే నక్కలు కూడా ఉంటాయి. మృగం మనిషిగా మారడం అనేది చాలా కష్టం. కానీ, మనిషి మాత్రం ఆడబిడ్డని చూస్తే చాలు మృగంలా మారిపోతాడు' అంటూ చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. సుదీర్ఘంగా సాగే పతాక సన్నివేశాలు అభిమానుల్ని మెప్పిస్తాయి. ఈ మధ్య వస్తున్న బాలకృష్ణ సినిమాలకి భిన్నంగా, బలమైన సందేశం, భావోద్వేగాలతో రూపొందిన సినిమా ఇది.
ఎవరెలా చేశారంటే: ఈ సినిమాలో బాలకృష్ణ భిన్న కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తారు. ఆయన నటన, లుక్ సినిమాకి హైలైట్. తెలంగాణ యాసలో ఆయన చెప్పిన డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఇందులో పోరాట ఘట్టాలు కూడా ఇదివరకటి సినిమాల్లాగా కాకుండా సహజంగా ఉంటాయి. శ్రీలీలకి దక్కిన ఓ మంచి అవకాశాన్ని పక్కాగా సద్వినియోగం చేసుకుంది. భావోద్వేగ సన్నివేశాల్లోనూ, యాక్షన్ సీన్స్‌లోనూ ఆమె ప్రతిభ ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాలతో మరింతగా కట్టిపడేసింది. రాహుల్ సాంఘ్వీ పాత్రలో అర్జున్ రాంపాల్ నటన మెప్పిస్తుంది. కాజల్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేకపోయినప్పటికీ బాలకృష్ణకి తగిన జోడీ అనిపించుకుంటుంది.