Bhagavanth Kesari OTT Performance :టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ- స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన సినిమా 'భగవంత్ కేసరి'. దసరా కానుకగా అక్బోబర్ 19న విడుదలైన ఈ సినిమా.. దాదాపు ఐదు వారాల పాటు బాక్సాఫీసు ముందు మంచి వసూళ్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్‌ను కూడా సాధించి లాభాలు తెచ్చిపెట్టింది. ఇటీవల ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. అయితే థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ భగవంత్ కేసరి రికార్డులు సృష్టిస్తోంది. ఓటీటీలోకి విడుదలైన 24 గంటల్లోనే టాప్‌లో ట్రెండింగ్ అయింది.
సందేశాత్మక సినిమాగా రూపొందిన 'భగవంత్ కేసరి' తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ.. అమెజాన్‌లో టాప్‌లో కొనసాగుతోంది. ఇక తెలుగు వెర్షన్ మొదటి స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. హిందీ వెర్షన్ టాప్ 3లో నిలిచింది. అలాగే గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన చిత్రంగా భగవంత్ కేసరి రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ అమెజాన్ పోస్టర్ విడుదల చేసింది.
బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్!
ఆరు పదుల వయసులో కూడా నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు. 'అఖండ', 'వీరనరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి'తో హ్యాట్రిక్స్ హిట్ సాధించి పుల్ జోష్‌లో ఉన్నారు. ఈ విజయాలతో టాలీవుడ్ సీనియర్ హీరోలతో పాటు కుర్ర కథానాయకులకూ సవాల్ విసురుతున్నారు.