Bhagavanth Kesari Anil Ravipudi :స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహం బాలకృష్ణ- శ్రీలీల కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'భగవంత్ కేసరి'. గురువారం విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో అనిల్ రావిపూడి మాట్లాడారు.
"'భగవంత్ కేసరి'.. ఈ సినిమా షానా ఏండ్లు యాదుంటాది అని ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుంచి చెబుతున్నాం. దాన్ని మీ అందరూ నిజం చేశారు. ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందనకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకూ ఆరు సినిమాలు చేశా. ఫిల్మ్ మేకర్‌గా ఇది నాకు పూర్తి సంతృప్తిని ఇచ్చింది. ఈ సినిమా గొప్ప విజయాన్ని అందుకోవడానికి ప్రధాన కారణం భావోద్వేగాలు. తండ్రీకుమార్తెల ఎమోషన్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ సర్‌కు థ్యాంక్యూ చెప్పాలి. ఆయన అవకాశం ఇవ్వకపోయి ఉంటే నన్ను నేను ఇలా నిరూపించుకునేవాడిని కాదు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి వర్క్ చేశారు. శ్రీలీల.. విజ్జిపాపగా అద్భుతంగా యాక్ట్ చేసింది. క్లైమాక్స్‌లో చూపించిన యాక్షన్ సీన్స్ కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో ఈ సినిమా మరింత గొప్ప విజయాన్ని అందుకుంటుంది" అని అనిల్ రావిపూడి ఆశాభావం వ్యక్తం చేశారు.
శ్రీలీల గ్లామర్ ఈ సినిమాలో మిస్ అయ్యిందని కొంతమంది రివ్యూ రాశారు. వాటిపై మీ స్పందన ఏమిటి
అనిల్ రావిపూడి: నేను రివ్యూలను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే వర్డ్ ఆఫ్ మౌత్ అన్నింటి కంటే పెద్దది. జనాల నుంచి వచ్చే మాటే ఒక సినిమా భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సినిమాలోని సున్నితమైన అంశాలను అర్థం చేసుకుని చాలా మంది పాజిటివ్‌గానే రివ్యూలు రాశారు. మీరు అన్నట్టు శ్రీలీల గ్లామర్, డ్యాన్సులు ఈ సినిమాలో మిస్ అయ్యాయని రివ్యూలు రాసిన వాళ్లు ఆమెకు అభిమానులు అయ్యి ఉంటారు. వాళ్లు ఆమె నుంచి డ్యాన్సులు చూడాలని కోరుకున్నారేమో. ఒక ఫోబియాతో బాధపడే అమ్మాయిని సివంగిలా మార్చాలనుకునే తండ్రి కథలోనూ డ్యాన్సులు చూడాలనుకున్నారంటే వారి మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.