లాస్ ఏంజల్స్‌లోని డాల్బీ థియేటర్లో 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా ప్రారంభమైంది. జిమ్మీ కిమ్మెల్ ఈ అవార్డుల ప్రధానోత్సవంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా ఒక్కో విభాగంలో విజేతలను బాలీవుడ్ తారాగణం ప్రకటిస్తోంది. ఈ వేడుకకు ప్రముఖులు, తారలతో పాటు, ఈ ఏడాది ఆస్కార్‌కు నామినేట్ అయిన సినిమాల నటీనటులు, సాంకేతిక సిబ్బంది కూడా హాజరయ్యారు. ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కూడా ఈ వేడుకకు హాజరైంది. ఆర్ఆర్ఆర్ చిత్ర బృదంలో దర్శకుడు రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్, కీరవాణి వారి సతీమణులతో ఈ వేడుకకు హాజరై సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ వేదికపై తెలుగు పాట 'నాటు నాటు'ను ప్రదర్శించారు. హాలీవుడ్ డ్యాన్సర్లు ఈ నాటునాటు పాటకు చిందులేశారు. ఈ పాట ప్రదర్శించినప్పుడు డాల్బీ థియేటర్ మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది.
భారతీయ షార్ట్ ఫిల్మ్‌కు ఆస్కార్ అవార్డు.. సత్తా చాటిన ది ఎలిఫెంట్ విస్పరర్స్
07:21 March 13
Best Documentary Short Film
అయితే ఈ 2023 ఆస్కార్ అవార్డుల జాబితాలో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్‌తో పాటు మరో భారతీయ చిత్రానికి పురస్కారం దక్కింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో భారతీయ చిత్రం 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'ను ఆస్కార్ వరించింది. 95వ ఆస్కార్ అకాడమీ అవార్డ్స్‌లో ఈ తమిళ డాక్యుమెంటరీకి ఈ పురష్కారం దక్కడం విశేషం. 'హౌలౌట్', 'హౌ డు యు మెసర్ ఎ ఇయర్', 'ది మార్టా మిచెల్ ఎఫెక్ట్', 'స్ట్రేంజర్ ఎట్ ది గేట్' వంటి డాక్యుమెంటరీలు ఈ అవార్డు కోసం పోటీ పడ్డాయి. చివరకు ది ఎలిఫెంట్ విస్పరర్స్ను ఆస్కార్ వరించింది. కార్తికి గొన్సాల్వేస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ అవార్డ్‌ను చిత్ర దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్, నిర్మాత గునీత్ మోగ్నలు కలిసి అందుకున్నారు. దీంతో స్టేజ్‌పై మాట్లాడిన వీరిద్దరూ.. తమ శ్రమను గుర్తించి, ప్రతిష్టాత్మక అవార్డును అందించిన అకాడమీ బృందానికి పత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. "మేము ఇండియన్ సినిమా చరిత్రలో తొలిసారిగా ఆస్కార్‌ను గెలుచుకున్నాము. ఇద్దరు మహిళలు దీన్ని సాధించారు. నేను ఇంకా వణుకుతున్నాను" అని ది ఎలిఫెంట్ విస్పరర్స్ నిర్మాత గునీత్ మోంగా ట్వీట్ చేశారు.
ఇదే ఈ షార్ట్ ఫిల్మ్ కథ.. తప్పిపోయిన ఏనుగును పెంచి పోషించిన దంపతుల కథతో భారతీయ దర్శకురాలు కార్తికి గోన్సాల్వెన్ తెరకెక్కించారు. దీనిని సిఖ్యా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో.. గునీత్ మోంగా, ఆచిన్ జైన్‌లు కలిసి నిర్మించారు. బొమ్మన్-బెల్లి జంటకు.. తప్పిపోయి వచ్చిన 'రఘు' అనే ఓ ఏనుగుకు మధ్య బలమైన విడదీయలేని బంధం ఏర్పడుతుంది. వారి మధ్య ఉన్న సహజ అనుబంధాన్ని ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రకృతికి అనుగుణంగా ఉన్న గిరిజన ప్రజల జీవితాన్ని గురించి కూడా ఇందులో చూపించారు. తమినాడులోని ముదుమలై నేషనల్ పార్క్‌లో ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించి.. ప్రకృతి సౌందర్యాన్ని చూపించారు. 2022 డిసెంబర్ 8న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రపంచ వ్యాప్తంగా ఈ డాక్యుమెంటరీ విడులదైంది. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇకపోతే గతంలోనూ ఇదే విభాగంలో ఇండియన్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన రెండు డాక్యుమెంటరీలు ఈ ఆస్కార్ అవార్డ్‌ను సొంతం చేసుకున్నాయి. 'స్మైల్ పింకీ', 'పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్' డాక్యుమెంటరీలు ఆస్కార్‌ను సొంతం చేసుకున్నాయి.