Bedurulanka 2012 Movie Review :చిత్రం: బెదురులంక 2012; నటీనటులు: కార్తికేయ, నేహాశెట్టి, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య, ఎల్బీ శ్రీరామ్, జబర్దస్త్ రామ్ ప్రసాద్; సంగీతం: మణిశర్మ; సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ , సన్నీ కూరపాటి; ఎడిటింగ్: విప్లవ్ నైషధం; నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పలనేని; రచన, దర్శకత్వం: క్లాక్స్; విడుదల తేదీ: 25-08-2023.
'ఆర్ ఎక్స్ 100' సినిమాతో అరంగేట్రంలోనే సక్సెస్ అందుకున్నారు హీరో కార్తికేయ. ఆ తర్వాత ఆయన నుంచి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాలేదు. అయినప్పటికీ ఫలితాలతో సంబంధం లేకుండా.. వైవిధ్యభరితమైన కథలతోనే ప్రయాణిస్తూ వస్తున్నారు కార్తికేయ. ఆ క్రమంలో ఆయన కీలక పాత్రలో నటించిన 'బెదురులంక 2012' (Bedurulanka 2012) సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..
ఇదీ కథ..
Bedurulanka 2012 Story : 2012 డిసెంబర్.. యుగాంతం జరగబోతుందంటూ ప్రచారం జోరు మీదున్న సమయమిది. ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామమైన బెదురులంక ప్రజల్లో ఈ యుగాంతపు భయాలు అప్పటికే దృఢంగా నాటుకుపోయాయి. దీంతో ఆ భయాల్ని.. ఊరి ప్రజల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని.. ఆ గ్రామంలో పెద్ద మనిషిగా చెలామణి అయ్యే భూషణం (అజయ్ ఘోష్) అందర్నీ దోచేయాలని ప్రణాళిక రచిస్తాడు. బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్) అనే ఓ దొంగ బాబాను, డేనియల్ (రామ్‌ప్రసాద్) అనే ఫేక్ ఫాస్టర్‌ను పావులుగా ఎంచుకొని.. తన ప్రణాళిక అమలు చేయాలనుకుంటాడు. వారి సహాయంతో ఊరి ప్రజల బంగారం మొత్తం కొల్లగొట్టడానికి ఓ ఎత్తుగడ వేస్తాడు.
సరిగ్గా అదే సమయానికి సిటీలో ఉద్యోగం మానేసి ఊరిలోకి అడుగుపెడతాడు హీరో శివ (కార్తికేయ). తన మనసుకు నచ్చినట్లు బతికే శివ.. బ్రహ్మం, డేనియల్‌ల మాటల్ని అసలు లెక్కచేయడు. ఆ వ్యక్తిత్వంతోనే ఊరిని దోచేయాలన్న భూషణం పన్నాగాలకు ఎదురు నిలుస్తాడు. ఈ క్రమంలోనే తనెంతగానో ప్రేమించిన ఆ ఊరి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ) కూతురు చిత్ర (నేహా శెట్టి)కి, పుట్టిన ఊరికి, కన్నవాళ్లకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. మరి ఆ తర్వాత ఏమైంది? ఊరిని దోచేయాలనుకున్న భూషణం ప్రణాళికల్ని ఎలా తిప్పి కొడతాడు? భక్తి ముసుగులో ఉన్న.. బ్రహ్మం, డేనియల్ అసలు రంగు ఎలా బయటపెట్టాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు? అనేదే సినిమా స్టోరీ..
ఎలా ఉందంటే: 2012 డిసెంబర్ 21తో ప్రపంచమంతా అంతమైపోతుందంటూ.. దశాబ్ద కాలం క్రితం జరిగిన ప్రచారం యావత్ ప్రజానీకాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ యుగాంతపు కథాంశంతో వార్తా ఛానెళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు, ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. అదే సమయంలో ప్రజల్లో ఉన్న భయానికి.. మతం, భక్తి పేరుతో ఓ ముసుగు తొడిగి ఎంతో మంది మోసగాళ్లు దోచుకునే ప్రయత్నం చేశారు. ఇలా ప్రజల్లో ఉన్న భక్తిని.. భయాన్ని అడ్డం పెట్టుకొని మూఢనమ్మకాలతో పేరుతో ఎన్నో అకృత్యాలకు పాల్పడుతున్న వ్యక్తులను ఈమధ్య చూస్తూనే ఉన్నాము. ఇదే అంశాన్ని వినోదాత్మకంగా చర్చిస్తూ.. ఈ 'బెదురులంక'తో ఓ మంచి సందేశమిచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు క్లాక్స్. ఓవైపు యుగాంతపు వార్తలు.. మరోవైపు బెదురులంక ప్రజల వ్యక్తిత్వాల్ని చూపిస్తూ సినిమాని ఆరంభించిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది. ఆ వెంటనే ఓ సింపుల్ సీన్‌తో హీరో పాత్రను.. అతని వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు డైరెక్టర్.
ఇక ఇంటర్వెల్‌కు ముందే అసలు కథ మొదలవుతుంది. అప్పటి వరకూ.. హీరో హీరోయిన్ ప్రేమ కథ, ఊరిలోని పాత్రల పరిచయాలు ఉంటాయి. ఇక భూషణం.. బ్రహ్మం, డేనియల్‌లతో కలిసి గ్రామ ప్రజల బంగారాన్ని దోచేయడానికి కుట్ర పన్నుతాడో.. అప్పటి నుంచే కథలో వేగం పెరుగుతుంది. తర్వాత సెకండ్ హాఫ్‌లో.. ఊరిలోకి అడుగుపెట్టడం.. ఆ గ్రామ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాన్ని పోగొట్టడానికి.. హీరోఫ్రెండ్స్‌తో కలిసి ఓ సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టడం వల్ల కథ మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అప్పుడే కమెడియన్లు సత్య, వెన్నెల కిషోర్ స్టోరీలోకి ఎంట్రీ ఇస్తారు. వీరి రాకతో కథ.. వినోదాత్మకంగా మారుతుంది. బెదురులంకకు బయటి ప్రపంచంతో సంబంధాలు కట్ చేసి.. నిజంగానే అక్కడ యుగాంతం మొదలైనట్లుగా ప్రజల్ని భ్రమింపజేసే ఎపిసోడ్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ఇక చావు భయం నుంచి బయటపడి.. మనసుకు నచ్చినట్లుగా బతకాలని గ్రామ ప్రజలు నిర్ణయించుకున్నాక.. వాళ్లలోని అసలు వ్యక్తిత్వాల్ని బయట పెట్టే తీరు సరదాగా ఉంటుంది. (Bedurulanka 2012 review in telugu). మనిషి తన సహజ స్వభావానికి తగ్గట్లుగా ఏ ముసుగు లేకుండా నిజాయితీగా బతకడంలోనే అసలైన ఆనందం ఉందంటూ ఓ చిన్న సందేశంతో సినిమాకు శుభం కార్డు పడుతుంది.
ఎవరెలా చేశారంటే: శివ పాత్రలో కార్తికేయ ఎంతో సహజంగా కనిపించాడు. ఆద్యంతం చాలా సెటిల్డ్‌గా నటించాడు. దర్శకుడు కూడా హీరోయిజం పేరుతో అనవసరమైన హడావుడి చేయకుండా శివ పాత్రను ఎంతో వాస్తవికంగా తెరపైకి తీసుకొచ్చాడు. నేహా శెట్టి తెరపై చాలా అందంగా కనిపించింది. కార్తికేయతో ఆమె కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. కానీ వీరిద్దరి లవ్‌ట్రాక్‌లో పెద్దగా ఫీల్ కనిపించలేదు. భూషణం పాత్రలో.. అజయ్ ఘోష్, బ్రహ్మంగా శ్రీకాంత్ అయ్యంగార్, డేనియల్‌గా రామ్ ప్రసాద్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి. సత్యలోని కామెడీ కోణాన్ని పెద్దగా ఉపయోగించుకోలేదు. వెన్నెల కిషోర్, రాజ్‌కుమార్ పాత్రలు సెకెండ్ హాఫ్‌లో చక్కటి వినోదాన్ని పంచుతాయి. దర్శకుడు తాను ఎంచుకున్న కథను నిజాయితీగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. మణిశర్మ సంగీతం, సినిమాకు అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది. సాయిప్రకాష్, సన్నీ కూరపాటి ఛాయాగ్రహణం బాగుంది. లంక గ్రామంలోని అందాలను తమ కెమెరాతో చక్కగా పట్టుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
- బలాలు
- + కథా నేపథ్యం..
- + కార్తికేయ నటన
- + యుగాంతం నేపథ్యంలో పండే వినోదం
- బలహీనతలు
- - నెమ్మదిగా సాగే కథనం
- - ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు
- చివరిగా: ఆరంభంలో కాస్త బెదరగొట్టినా.. ద్వితీయార్ధం కడుపుబ్బా నవ్విస్తుంది! (Bedurulanka 2012 review)
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!