బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం పలు సినిమాలతో పాటు హిందీలో ఎంతో ప్రేక్షాకదరణ కలిగిన బిగ్‌బాస్ సీజన్ 16కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికే ఈ షో 15 సీజన్లను పూర్తి చేసుకుంది. కాగా తాజాగా ఈ షో కి సంబంధించిన ఓ ప్రోమో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. వీడియో విడుదలైన గంటల వ్యవధిలోనే లక్షల కొద్ది వ్యూస్‌ను సంపాదించింది. ఇంతకీ ఏముంది ఈ వీడియోలో అనుకుంటున్నారా..
ప్రముఖ పంజాబీ లేడీ కమిడియన్ భారతీ సింగ్.. తన భర్త హార్ష్ లింబాచియాతో కలిసి బిగ్‌బాస్‌కు అతిథిగా హాజరయ్యారు. అంతేగాక తమ 9 నెలల కుమారుడినీ షోకు తీసుకు వచ్చారు. అయితే షో లో పాల్గొంటున్న కంటెస్టెంట్స్‌ను కలవడానికి వచ్చిన ఈ దంపతులు కాసేపు స్టేజీపై నవ్వులు పూయించారు.
షో ప్రారంభ సమయంలో భారతీ సింగ్ దంపతులను వేదిక పైకి ఆహ్వానించారు సల్మాన్. అయితే భారతీ తమ కుమారుడు లక్ష్ సింగ్ లింబాచియా(గోలా)ను కూడా వేదిక పైకి తీసుకువచ్చారు. వీరు సల్మాన్‌తో చేసిన సందడి అందరిని కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ క్రమంలోనే ఆమె 'సారే వాదే యాద్ హై సల్మాన్ భాయ్'(సల్మాన్ ఖాన్ అన్న గారిచ్చిన అన్ని హామీలు నాకు గుర్తుకున్నాయి).. అలాగే మీరు నా కుమారుడిని ఎలా లాంఛ్ చేస్తారన్న విషయం కూడా నాకు గుర్తుంది అని నవ్వుతూ అన్నారు.
స్టేజీపైకి తన కుమారుడిని తీసుకొచ్చిన భారితీ.. 'బుడ్డోడిని ఎత్తుకోని అలిసిపోయాను కాసేపు వీడిని మీరు ఎత్తుకోండి' అని ఫన్నీగా సల్మాన్‌తో అనడం... ఆ వెంటనే సల్మాన్ ఖాన్ కూడా 'కచ్చితంగా మీరు అలిసిపోతారు' అని జోక్ చేయడం కితకితలు పెట్టించింది. ఈ ఫన్నీ సంభాషణల మధ్యలో సల్మాన్.. తాను ఎంతో సెంటిమెంట్‌గా భావించే తన చేతికి ఉన్న బ్రేస్‌లెట్‌ను తీసి భారతీ కుమారుడు గోలాకి సంక్రాంతి కానుకగా బహుకరించారు. దీనికి వెంటనే స్పందించిన భారతీ.. 'సల్మాన్ మీరు ఉండే పాన్వెల్ ఫామ్‌హౌస్‌ను ఖాళీ చేయాలి.. ఎందుకంటే అది నా కుమారుడు లక్ష్ పేరు మీద బదిలీ చేశారు' అంటూ చమత్కరించారు. ఇందుకు సల్మాన్ పగలబడి నవ్వారు. ఇక సల్మాన్‌తో మాట్లాడిన అనంతరం దంపతులిద్దరూ బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్‌ను కలిసేందుకు లోపలికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.
కాగా, గతేడాది మేలో కూడా ఓ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ భాయ్ చేతికుండాల్సిన బ్రేస్‌లెట్‌ను హీరోయిన్ పూజా హెగ్డే తన చేతికి వేసుకోని ఫొటో దిగింది. అప్పట్లో ఈ ఫొటో తెగ వైరలైంది. మళ్లీ ఇప్పుడు అదే బ్రేస్‌లెట్‌ను మొత్తానికి భారతీ కుమారుడు గోలాకు ఇవ్వడంతో సల్మాన్ చేతి కంకణం మరో సారి వార్తల్లోకి నిలిచింది.