బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్స్టాపబుల్ - 2' కొత్త ప్రోమో వచ్చేసింది. ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోన్న ఈ సెలబ్రిటీ టాక్షో నాలుగో ఎపిసోడ్కు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, సినీ నటి రాధిక, రాజ్యసభ ఎంపీ సురేశ్ విచ్చేశారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ ప్రోమోలో.. 'బాలయ్య కుటుంబాన్ని చూసిన మీకు... ఇవాళ బాలయ్య స్నేహాన్ని పరిచయం చేయాలనిపించింది' అంటూ నటసింహం నందమూరి బాలకృష్ణ తన కాలేజీ రోజుల్ని గుర్తుచేసుకున్నారు.
అర్ధరాత్రి ఫోన్ కాల్... 'అన్స్టాపబుల్ 2' స్టేజి మీదకు కిరణ్ కుమార్ వచ్చిన వెంటనే 'అధ్యక్షా... నా మైక్ ఆపేశారు అధ్యక్షా!' అంటూ బాలకృష్ణ నవ్వులు పూయించారు. తాను స్పీకర్ అయిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసిన బాలకృష్ణ అదే మాట్లాడారని కిరణ్ గుర్తుచేసుకున్నారు. తమ కాలేజీ రీ యూనియన్ ఫోటోలు చూపించిన బాలయ్య.. ఆ రోజుల్లో తాము చేసిన హంగామా గురించి చెబితే ఎవరూ నమ్మరని అన్నారు. 'మేం అమ్మాయిలకు సైట్ కొట్టడం కోసం బైక్స్ ఎక్స్ఛేంజ్ చేసుకునేవాళ్లం' అంటూ నాటి రోజుల్ని బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. వెంటనే మాట అందుకున్న కిరణ్కుమార్.. 'అక్కడ చేసిన తర్వాతే ఇక్కడ నటుడు అయ్యావ్' అంటూ నవ్వించారు.