"బాలకృష్ణ వ్యక్తిత్వం లార్జర్ దేన్ లైఫ్‌లా కనిపిస్తుంది. ఆ ఇమేజ్‌ని తెరపైన ఇంకెంత గొప్పగా ఆవిష్కరిస్తామనే విషయంపైనే ప్రత్యేకంగా దృష్టిపెట్టాం. సినిమాకి సంబంధించి అన్ని విభాగాలపైనా అవగాహన ఉన్న ఆయనతో పనిచేయడం ఆనందాన్నిచ్చింది" అన్నారు ఛాయాగ్రాహకుడు రిషి పంజాబీ. 'సరైనోడు', 'జయ జానకి నాయక', 'వినయ విధేయ రామ'తోపాటు, హిందీలోనూ పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన ఆయన ఇటీవల 'వీరసింహారెడ్డి' చిత్రానికి కెమెరా బాధ్యతల్ని నిర్వర్తించారు. బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రిషి పంజాబీ 'వీరసింహారెడ్డి' ప్రయాణం గురించి మాట్లాడారు.
'బాలకృష్ణ వ్యక్తిత్వం లార్జర్ దేన్ లైఫ్.. సినిమాలో అంతకంటే గొప్పగా..' - వీరసింహారెడ్డి రిలీజ్ డేట్
'వీరసింహారెడ్డి'తో సంక్రాంతికి బాలయ్య సందడి చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన కొన్ని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ చిత్రం గురించి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే..
"బాలకృష్ణ ఇమేజ్‌కి తగ్గట్టుగానే ఉంటుందీ చిత్రం. యాక్షన్, భావోద్వేగాలు మేళవింపు చాలా బాగా కుదిరింది. విజువల్స్ మరో స్థాయిలో ఉంటాయి. లండన్ నుంచి తెచ్చిన కొత్త సెటప్ లెన్స్‌తో చిత్రీకరణ చేశాం. కలర్స్ చాలా బాగుంటాయి. బాలకృష్ణ సాంకేతిక బృందాన్ని గొప్పగా అర్థం చేసుకుంటారు. ఆయన స్వేచ్ఛనిస్తూ చిత్రబృందాన్ని సౌకర్యంగా ఉంచుతారు. అదే ఆయన ప్రత్యేకత. గోపీచంద్ మలినేని మంచి దర్శకుడు. తనతో కలిసి 'క్రాక్' సినిమాకే నేను పనిచేయాల్సింది. కానీ అప్పుడు కుదర్లేదు. ఇలాంటి మాస్ చిత్రాలు చేయడాన్ని ఆస్వాదిస్తా" అన్నారు రిషి పంజాబీ.