నటసింహం బాలకృష్ణ సినిమా వస్తుందంటే.. అభిమానులకు అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ఆయన సినిమాల్లో ఉండే యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న సన్నివేశాల్లోనూ తన నటనతో థియేటర్లో విజిల్స్ వేయిస్తారు బాలయ్య. అయితే ఆయన చాలా రోజుల తర్వాత ఫ్యాక్షన్ గెటప్‌లోకి మారి చేస్తున్న సినిమా 'వీర సింహా రెడ్డి'. బాలయ్యకి డై హార్డ్ ఫ్యాన్ అయిన గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటం వల్ల ప్రమోషన్స్.. నందమూరి అభిమానులకి కిక్ ఇచ్చే రేంజులో జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన 'జై బాలయ్య', 'సుగుణ సుందరి', 'మా బావ మనో భావాలు' సాంగ్స్, పోస్టర్స్, టీజర్ విడుదలై తెగ ఉర్రూతలూగించాయి. తమన్ ఇచ్చిన ట్యూన్స్ బాలయ్య ఫాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నాయి.
అయితే తాజాగా.. వీటన్నింటికీ మించేలా.. సినీ ప్రేక్షకులతో పాటు నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను విడుదల చేసింది. ఫ్యాన్స్‌లో పూనకాలను రెట్టింపు చేసింది. ఇందులో బాలయ్య యాక్షన్, డ్యాన్స్, డైలాగ్‌లు ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టించేలా ఉంది. డైలాగ్సైతే అదిరిపోయాయి.
'సీమలో ఏ ఒక్కడు కత్తి పట్టుకోకూడదని నేను ఒక్కడినే కత్తి పట్టా.. పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు సీమపై ఎఫక్షన్, పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం. రూలింగ్ కర్నూల్', 'పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్‌కు అయినా లేచి నిలబడు అక్కడ ఓ స్లోగన్ వినపడుతుంది', 'అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ లొకేషన్ చూడను ఒంటిచేత్తో ఊచకోత', 'సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు', 'పదవి చూసుకుని నీకు పొగరేమో, కానీ నాకు బై బర్త్ నా డీఎన్ఏకే పొగరు ఎక్కువ' వంటి డైలాగ్స్‌లో ట్రైలర్ ఆద్యంతం పూనకాలు తెప్పిస్తోంది. మొత్తంగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే కాదు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ఉంది.
కాగా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. సినిమా ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న మూవీ విడుదల కానుంది.
ఇదీ చూడండి:దిల్ రాజు మనవరాలి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్ సందడి