'లగ్తాహైకి ఆస్మాన్ సే ఫరిస్తా ఉతర్‌కే సంగ్‌మే మరమరాన్‌మే బనాలేంగే.. హర్ ఖలీ మస్తే ఖాబ్ హో జాతిహై.. పత్తీ పత్తీ గులాబ్ హోజాతీ హై'... దీని అర్థం తెలియకపోయినా దాదాపుగా చాలా మంది దీన్ని వినే ఉంటారు. ఎందుకంటే ఇది మన బాలయ్య నోటి నుంచి జారిన కవిత. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా సక్సెస్ మీట్లో హీరోయిన్ పూజాహెగ్డేను అభివర్ణిస్తూ చెప్పారాయన. అది అప్పుడు ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ అయింది.
అయితే ఇప్పుడా కవిత మళ్లీ సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే.. సాధారణంగా చిన్న సినిమాలపై ప్రేక్షకుల్లో హైప్, ఆసక్తిని పెంచడానికి.. తమ చిత్రాల్లో భిన్నమైన ప్రయోగాలు చేస్తుంటారు మన హీరోలు దర్శకులు. అలా కొన్ని సందర్భాల్లో మరో హీరో చెప్పిన డైలాగ్స్, వాళ్ల సాంగ్స్‌ను లేదా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వాటిని.. తాజా చిత్రాల్లో రీక్రియేట్ చేసి ఉపయోగించేస్తారు. అలా ఈ సారి బాలయ్య చెప్పిన 'పత్తీ పత్తీ గులాబ్ హోజాతీ' కవితను ఉపయోగించారు. ఎందులో అంటే.. యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం 'లైక్ షేర్ అండ్ సబ్‌స్రైబ్'. ఈ మూవీ నవంబరు 4న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను రిలీజ్ చేస్తూ.. అందులో భాగంగానే ఓ సాంగ్‌ను విడుదల చేశారు. ఆ పాటే 'పత్తీ పత్తీ గులాబ్ హోజాతీ'. ఈ లైన్‌తో మొదలైన ఆ లవ్ సాంగ్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. నెట్టింట్లో మంచి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. దీంతో ఆ పాటను, బాలయ్య చెప్పిన కవితను రెండింటిని జోడించి ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో ట్రెండ్ చేసేస్తున్నారు.