'నటుడిగా నేనింకా సంతృప్తి చెందలేదు.. చెంఘీజ్‌ఖాన్ సినిమా ఎప్పటికైనా చేసి తీరుతా' అని నందమూరి నటసింహం బాలకృష్ణ 'వీర సింహారెడ్డి' ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పిన సంగతి తెలిసిందే. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ఆ సినిమా చేస్తానని అన్నారు. అయితే దీంతో సినీ ప్రేక్షకులందరూ చెంఘీజ్‌ఖాన్ ఎవరబ్బా అని ఆరా తీయడంలో బిజీ అయ్యారు. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరంటే?
ప్రపంచంలోనే పేరు పొందిన మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తే ఈ చెంఘీజ్‌ఖాన్. ఈశాన్య ఆసియాలోని ఓ సంచారజాతికి చెందిన అతడి అసలు పేరు టెమూజిన్. మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించి.. దాని విస్తరణ కోసం ఎన్నో దండయాత్రలు చేశాడని పలు చారిత్రక రచనల్లోని సమాచారం. అలా, ఏదైనా రాజ్యంపై చెంఘీజ్ దాడి చేస్తే.. అక్కడి ప్రజలపై అతడి సైన్యం క్రూరత్వం ప్రదర్శించేదని.. మహిళలను సైతం ఎత్తుకు వెళ్లిపోయేవాళ్లని ఆ రచనల్లో ఉండేది. అతడి సైన్యం చేసే వికృత చేష్టలు తట్టుకోలేక పలు రాజ్యాధినేతలు సామంతులుగా మారిపోయారనే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే అతడి గురించి, అతడి సామ్రాజ్యం గురించిన వాస్తవాలపై ఎక్కడా సరైన సమాచారం లేదు.