Balakrishna Bhagavanth Kesari :నందమూరి నటసింహం బాలకృష్ణ, కాజల్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ సినిమా అక్టోబర్ 19 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా మూవీ టీమ్.. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొని సందడి చేసింది. అయితే అందులో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన బాలయ్య.. తనకు ఎదురైన ఓ సంఘటన గురించి చెప్పుకుచ్చారు.
"సినిమాటోగ్రాఫర్ రామ్‌ప్రసాద్ నాకు ఎప్పటి నుంచో బాగా తెలుసు. మేమంతా కలిసే భోజనం చేసేవాళ్లం. అయితే అప్పట్లో కారవాన్‌లు ఉండేవి కావు. చాప, దిండు వేసుకుని నేలపైనే పడుకునేవాళ్లం. ఆ సమయంలో నేను విగ్గు తీసేవాణ్ని. 'ఈయన విగ్గు పెట్టుకుంటాడు' అంటూ ఇటీవల ఒకాయన నా ముందు ఎగతాళిగా మాట్లాడాడు. అవునయ్యా విగ్గు పెట్టుకుంటా.. నువ్వు ఎందుకు గడ్డం పెట్టుకున్నావని నేను అడిగాను. మనదంతా ఓపెన్ బుక్. ఎవరికీ భయపడేదే లేదు" అని పేర్కొన్నారు.
Bhagavanth Kesari Press Meet : ఇక ఇదే వేదికగా సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను బాలకృష్ణ పంచుకున్నారు. "దేవాలయంలో మనం చేసే ప్రదక్షిణలు, దైవ నామస్మరణ 108తో ముడిపడి ఉంటాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నా 108వ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం నాకు ఆనందంగా ఉంది. దుర్గ అంటే స్త్రీ శక్తి. ఈ చిత్రం కూడా ఆ నేపథ్యంలో రూపొందిందే. ఈ సినిమా పవర్‌తో కూడుకున్నది. అనిల్ రావిపూడి విభిన్న చిత్రాలు తెరకెక్కిస్తుంటారు. ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. ఇండస్ట్రీకి ఆయన ఓ వరం అని నేను భావిస్తున్నాను. ఆయన్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. మేమిద్దరం ఈ సినిమాను సవాలుగా తీసుకున్నాం. గెటప్, యాస తదితర అంశాలను రీసెర్చ్ చేశాం. పోటీ ఉంటేనే ఏ రంగంలోనైనా మంచి ఫలితాలు వస్తాయి. మాకు మేమే పోటీ. నాకు ఎవరూ పోటీ కాదు. నేను ఎవ్వరినీ పట్టించుకోను. నా అభిమానుల్ని దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తాను. ప్రస్తుతం ప్రచార చిత్రాల్లో మీరు చూస్తున్న పాత్రతో పాటు, ఈ సినిమాలో ఇంకో పాత్ర కూడా ఉంది. అది చెబితే లీక్ చేసినట్టే అవుతుంది. దాన్ని స్క్రీన్‌పైనే చూడండి" అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. మరోవైపు సినిమాలో భాగమైన తమన్, కాజల్, శ్రీలీలను ఈ ప్రెస్ మీట్లో బాలయ్య కొనియాడారు.