ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు సినీ ప్రేక్షకులు కలిసి కాసేపు సినిమాల గురించి మాట్లాడుకుంటే.. అందులో తప్పనిసరిగా 'బలగం' ప్రస్తావన తప్పకుండావస్తోంది! ఎందుకంటే ఈ చిత్రంలో పల్లెటూరు పచ్చదనం, తెలంగాణ సంస్కృతి, ఆచారాలను మనుషుల మధ్య ఉండే సంబంధాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన తొలి చిత్రమిది. తన అద్భుత పనితీరుతో ఆడియెన్స్‌ను కంటతడి పెట్టించారు. బంధాల కన్నా మిగతా వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత సమాజంలో.. మళ్లీ మన మూలాలను గుర్తుచేశారు. దీంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న సినిమాగా రిలీజైన ఈ చిత్రానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విశేష ఆదరణ దక్కుతోంది. ప్రేక్షకుల మనసును దోచుకుంటోంది. ఇప్పటికే థియేటర్లలో అదరగొట్టిన ఈ చిత్రానికి ప్రస్తుతం ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. సెలబ్రిటీలు సైతం ఈ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మెరిసింది. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులను ముద్దాడింది. బెస్ట్ ఫీచర్ ఫిలిమ్, బెస్ట్ ఫీచర్ ఫిలిమ్ సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో రెండు అవార్డులు అందుకుంది. ఈ మేరకు.. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ నిర్వాహకులు.. సర్టిఫికెట్స్‌ను కూడా జారీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను దర్శకుడు వేణు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హర్షం వ్యక్తం చేశాడు. 'నా బలగం చిత్రానికి మూడో అవార్డు. అంతర్జాతీయ స్థాయిలో నా బలగం గుర్తింపు తెచ్చుకుంటోంది' అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ అవార్డు అందుకున్న వేణుకు అందరూ సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక బలగం సినిమా విషయానికొస్తే.. చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్, మురళీధర్‌గౌడ్, సుధాకర్‌రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు రూపొందించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.