తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పది రూపాయలు కూడా లేవు.. బ్యాంక్​ బ్యాలెన్స్​ జీరో: 'బలగం' అల్లుడు ఎమోషనల్​ - బలగం సినిమా అవార్డ్స్​

'బలగం' సినిమాలో నల్లి బొక్క వేయలేదని అలిగి, తనను సరిగ్గా గౌరవించలేదని.. పిల్లను ఇచ్చిన మామ కుటుంబంతో బంధం తెంచుకున్న అల్లుడిగా నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు నటుడు మురళీధర్ గౌడ్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు, కష్టాలను గుర్తుచేసుకుని ఎమోషనల్​ అయ్యారు. ఆ వివరాలు..

Balagam muralidhar goud
'బలగం' నటుడు మురళిధర్ గౌడ్​

By

Published : Apr 7, 2023, 6:49 AM IST

అల్లుడు వచ్చాడంటే.. ఎంతో మర్యాదగా చూసుకోవాలి. కొంచెం కూడా మర్యాద తగ్గకూడదు. మనసును నొప్పించకుండా అతనితో ప్రవర్తించాలి. మాంసం కూరతో వడ్డించే అన్నంలో నల్లి బొక్క వేయకపోయినా.. ఆ బంధాన్ని తెంచుకునే పంతం ఆ అల్లుడిలో ఉంటుందని 'బలగం' సినిమా చూస్తే తెలుస్తుంది! ఈ సినిమాలో అల్లుడి పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించిన నటుడు మురళీధర్ గౌడ్. తన నటనతో ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకున్నారు. అంతకుముందు డీజే టిల్లు సినిమాలో హీరోకు తండ్రిగా కనిపించి.. ఆ పాత్రతోనూ మెప్పించారు. ఇవి మాత్రమే కాదు ఇంకా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన 60ఏళ్ల వయసులో చిత్రసీమలోకి అడుగుపెట్టారట. అంతకుముందు జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు, కష్టాలను ఎదుర్కొన్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆ సంఘటనలను గుర్తుచేసుకుని ఎమోషనల్​ అయ్యారు.

"మాది మెదక్‌ జిల్లా రామాయంపేట. అదే నా స్వస్థలం. సిద్ధిపేటలో చదువు పూర్తి చేశాను. ఎలక్ట్రిసిటీ బోర్డులో దాదాపు 27 ఏళ్ల పాటు పనిచేసి రిటైర్మెంట్​ తీసుకున్నాను. మేం నలుగురం అన్నదమ్ములం, ఒక చెల్లి. నేను డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లో.. మా ఇంట్లో పది రూపాయలు కూడా ఉండేవి కాదు. మా కోసం అమ్మానాన్న ఎన్నో కష్టాలు పడ్డారు. వాటిని కళ్లారా చూశాను. ఓ సారి పది రూపాయలు మాకు ఎంతో అవసరం అయ్యాయి. మా అమ్మ.. మా బంధువుల్లో కాస్త రిచ్​గా ఉండే ఒకరు ఇంటికి వెళ్లి పది రూపాయలను అప్పుగా తీసుకురమ్మని చెప్పి పంపించింది. నాకేమో వాళ్లు ఇస్తారో, లేదో అని భయపడుతూనే వెళ్లి అడిగాను. ఇలా చాలా సార్లు జరిగింది. మా నాన్న మాకు చాలా దూరంగా పని చేసేవాడు. ఆయన ఇంటికి రాగానే ఆ పది రూపాయలను వాళ్లకు తిరిగి ఇచ్చేసేవాడిని. చిరిగిపోయిన బట్టలు కూడా వేసుకునేవాడిని. ఎగతాళి చేస్తూ దారుణంగా అవమానించేవారు. నేను ఉద్యోగం చేసినప్పుడు కూడా మా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. నేను రిటైర్‌మెంట్‌ అయినప్పుడు నా బ్యాంకు బ్యాలెన్స్‌ జీరో" అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

కాగా, బంధాల్ని నిలుపుకోవడం.. వాటిని కలకాలం కాపాడుకోవడమే బలం అని బలగం సినిమా ద్వారా తెలియజేశారు దర్శకుడు వేణు. కుటుంబ బాంధవ్యాలను కళ్లకు కట్టినట్లు చక్కగా చూపించారు. ఓ ఇంటి పెద్ద మరణించిన నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలోనే నారాయణ పాత్రలో మెప్పించి ఆకట్టుకున్నారు మురళీధర్‌ గౌడ్‌. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌, సుధాక‌ర్ రెడ్డి, రూపా లక్ష్మి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. చిన్న చిత్రంగా రిలీజైన ఈ సినిమా ఆడియెన్స్​ మనసుల్ని హత్తుకుని భారీ విజయాన్ని అందుకుంది. అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కూడా అందుకుంది.

ఇదీ చూడండి:బీచ్​లో పూనమ్​, అదా హాట్​ సెల్ఫీలు.. నభా అందాలు చూస్తుంటే..

ABOUT THE AUTHOR

...view details