తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సీక్వెల్స్​ జోరు.. అంచనాలు పెంచారు.. ఇక రావడమే ఆలస్యం! - pushpa 2 movie

'బాహుబలి', 'కేజీయఫ్'​ సీక్వెల్స్​ ఘన విజయాన్ని అందుకోవడంతో కొనసాగింపు చిత్రాల హవా కాస్త ఎక్కువగానే పెరిగింది. ఇప్పటికే విడుదలైన 'పుష్ప', 'విక్రమ్​' తొలి భాగం సూపర్ హిట్​ కావడం వల్ల రెండో భాగంపై బాగా ఆసక్తి పెరిగింది. అయితే దీంతో పాటే మరి కొన్ని కొనసాగింపు చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి.

Tollywood Hit movies Sequel trend
సీక్వెల్స్​ ట్రెండ్

By

Published : Aug 13, 2022, 6:30 AM IST

కథ.. పాత్ర.. రెండింటిలో ఏదో ఒకటి కొనసాగుతుంది. ఫ్రాంచైజీగానో లేదంటే, సీక్వెల్‌గానో... ఏదో ఒక తరహాలో ఓ సినిమా పేరు మళ్లీ మళ్లీ వినిపిస్తుంది. ఈ తరహా సినిమాల జోరు ఇప్పుడు ఎక్కువగానే కనిపిస్తోంది. విజయవంతమైన వాటిని కొనసాగించడం కొత్తేమీ కాదు. తెలుగులో ఎప్పట్నుంచో ఉన్నదే. ఇప్పుడు కొనసాగింపు చిత్రాలకి తోడుగా... ఫ్రాంచైజీ సినిమాలపైనా మక్కువ పెంచుకుంటున్నారు మన దర్శకులు.

'బాహుబలి', 'పుష్ప' ముందు ఒకే సినిమాగానే పట్టాలెక్కాయి. తీరా సెట్స్‌పైకి వెళ్లాక ఆ కథల్ని రెండు భాగాలుగా చెప్పాలనుకున్నారు దర్శకులు. తొలి సినిమాతోనే రెండో భాగాన్నీ చూడాలనే ఆసక్తిని పెంచడంలో వారు సఫలమయ్యారు. ‘కేజీఎఫ్‌ 2’ ఇదే కోవలోకి వచ్చి విజయాన్ని అందుకుంది. ఛాప్టర్లు ఛాప్టర్లుగా ఆ కథని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మూడో ఛాప్టర్‌ ముంగిట ఉంది ఆ చిత్రం. ఇవన్నీ కొనసాగింపులే.

‘ఎఫ్‌2’, ‘కార్తికేయ’ సినిమాలు ఫ్రాంచైజీలుగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ‘కార్తికేయ2’ ఈ శనివారమే విడుదలవుతోంది. ‘ఎఫ్‌2’ విజయవంతం కావడంతో, దానికి ఫ్రాంచైజీగా పాత్రల్ని కొనసాగిస్తూ, మరో కొత్త కథతో ‘ఎఫ్‌3’ తెరకెక్కింది. ‘ఎఫ్‌ 4’ ఉంటుందని ఇదివరకే దర్శకనిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘కార్తికేయ2’ తర్వాత కూడా చెప్పాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పారు దర్శకుడు చందు మొండేటి.

ఈమధ్య కాలంలో విడుదలై విజయవంతమైన ‘విక్రమ్‌’, ‘బింబిసార’ కథలు కొనసాగనున్నాయి. ‘విక్రమ్‌’ సినిమా క్లైమాక్స్‌లో రోలెక్స్‌ పాత్రలో సూర్య ఎంట్రీ ఇచ్చి కొనసాగింపుపై ఆసక్తిని పెంచారు. ‘బింబిసార’ చివరిలో సంజీవిని పుష్పాన్ని మరోసారి చూపించి ఈ కథ కొనసాగుతుందనే సంకేతం ఇచ్చింది. ఇప్పటికే దర్శకుడు వశిష్ట్‌ ‘బింబిసార2’ కోసం కసరత్తులూ మొదలుపెట్టారు. విజయ వంతమైన ‘సీతారామం’ని కొనసాగించే ఆలోచన ఉందని నిర్మాత అశ్వినీదత్‌ చెప్పారు. ప్రేమికులుగా హృదయాల్ని దోచుకున్న సీత, రామ్‌లని మరోసారి తెరపై చూస్తామన్నమాట. ‘డీజే టిల్లు’, ‘గూఢచారి’ సినిమాలకి కొనసాగింపు కథలు సిద్ధమవుతున్నాయి. ‘జాతిరత్నాలు’ మరోసారి తెరపై సందడి చేయనున్నారు.

ఎప్పుడైనా సరే సినిమాల్ని మార్కెట్‌ పద్దులే ప్రభావితం చేస్తుంటాయి. కొనసాగింపు లక్ష్యంతో తీసినప్పటికీ... చెప్పాల్సిన కథలు ఇంకా ఎన్ని ఉన్నా తొలి సినిమా విజయవంతమైతేనే మలి ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. పరాజయాన్ని చవిచూసిన ఓ కథని కొనసాగిస్తామని చెప్పినా దానిపై ఎవ్వరికీ ఆసక్తి ఉండదు. సీక్వెల్‌ ఉందంటూ ముగిసిన చాలా కథలు మళ్లీ తెరకెక్కకుండానే ఆగిపోయాయి. ఇటీవలే విడుదలైన ‘రామారావు ఆన్‌ డ్యూటీ’, ‘ది వారియర్‌’, ‘హ్యాపీ బర్త్‌డే’ బాక్సాఫీసు దగ్గర నిలబడలేకపోయాయి. ఆ సినిమాలన్నీ కొనసాగింపునకి సంకేతాలిస్తూ ముగిసిన కథలే. వీటికి మలిభాగం రూపొందుతుందా? లేదా? అనేది సందేహమే. తెలుగులో ఇప్పుడు సెట్స్‌పైన, స్క్రిప్ట్‌ దశలోనూ ఉన్న వాటిని గమనిస్తే ‘పుష్ప2’ మొదలుకొని బోలెడన్ని సీక్వెళ్లు ముస్తాబవుతున్నట్టు స్పష్టమవుతోంది.

ఇదీ చూడండి: రణ్​వీర్​ సింగ్​కు ముంబయి పోలీసుల సమన్లు.. ఆగస్టు 22లోగా!

ABOUT THE AUTHOR

...view details