ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విజువల్ వండర్ సినిమా 'అవతార్2'. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' పేరుతో డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర రన్‌టైమ్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. 'అవతార్2' నిడివి 192 నిమిషాల, 10 సెకన్లు అట. అంటే 3 గంటలా 12 నిమిషాల 10 సెకన్లు. ఇటీవల కాలంలో అత్యధిక నిడివి గల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా అరుదు. ఒకవేళ వచ్చినా, థియేటర్‌లో ప్రేక్షకుడిని అంత సేపు కూర్చోబెట్టాలంటే అందుకు తగిన కథ, కథనాలు, విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలి.
వామ్మో.. 'అవతార్2' రన్ టైమ్ అన్ని గంటలా.. - అవతార్ మూవీ ట్రైలర్
సినీలవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అవతార్ 2 సినిమా రన్‌టైమ్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆ వివరాలు..
'అవతార్2' రన్ టైమ్ విషయంలో దర్శకుడు జేమ్స్ కామెరూన్ పూర్తి విశ్వాసంతో ఉన్నారట. మూడు గంటల పాటు మరో కొత్త ప్రపంచంలో ప్రేక్షకుడిని తీసుకెళ్లడం ఖాయమని చెబుతున్నారు. 2009లో వచ్చిన మొదటి 'అవతార్' చిత్రం రన్ టైమ్ 162 నిమిషాలు. అంటే 2 గంటలా 42 నిమిషాలు మాత్రమే. మొదటి భాగంతో పోలిస్తే, పార్ట్2 అదనంగా దాదాపు మరో అరగంట నిడివి పెరిగింది. 'అవతార్2'కు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్ మొదలయ్యాయి. ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 3డీ ఐమ్యాక్స్, 4డీ అనుభూతి కలిగిన థియేటర్‌లలో సినిమా చూడాలంటే దాదాపు రూ.1000పైనే టికెట్ ధర (మెట్రో నగరాల్లో) ఉండటం గమనార్హం.
ఇదీ చూడండి:ఓ ఇదా అడివిశేష్ సక్సెస్ మంత్ర.. అందుకేనా ఇలా వరుస హిట్లు?