Avatar 2 Collections : జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన 'అవతార్2' సినిమా వసూళ్ల విషయంలో విడుదలకు ముందు నుంచే రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ధియేటర్లలో సందడి చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి కోట్లల్లో కలెక్షన్లు వసూలు చేస్తోంది. తాజాగా ఈ విజువల్ వండర్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. గ్లోబల్ టికెట్ అమ్మకాల్లో 1 బిలియన్ డాలర్ మార్క్‌ను 'అవతార్2' సినిమా అతి తక్కువ రోజుల్లో అలవోకగా దాటేసి రికార్డును సొంతం చేసుకుంది. 2022లో విడుదలైన మూడు సినిమాలు మాత్రమే 1బిలియన్ డాలర్ రికార్డును చేరుకోగలిగాయి. మిగతా రెండు సినిమాలకు ఈ రికార్డు సృష్టించడానికి నెలల సమయం పట్టగా.. 'అవతార్ 2' మాత్రం అతి తక్కువ రోజుల్లో ఈ ఘనత సాధించింది.
ఇక 2021లో విడుదలైన 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' సినిమా తొలిసారి 12 రోజుల్లో 1 బిలియన్ డాలర్ల మార్కును చేరుకోని ప్రపంచవ్యాప్తంగా మొదటిస్థానంలో నిలిచింది. తాజాగా విడుదలైన 'అవతార్2' సినిమా 14 రోజుల్లో సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఇక ఈ సినిమా ఇప్పటికీ అన్ని ధియేటర్లలో హౌస్‌ఫుల్‌తో సందడి చేస్తోంది. భారత్‌లోనూ వందల కోట్లు కొల్లగొడుతూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ విజువల్ వండర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు జై కొడుతున్నారు.