అహ్మదాబాద్ వేదికగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ సిరీస్ ఎంతో ఉత్కంఠంగా సాగుతోంది. ఓ వైపు ఆసీస్ ప్లేయర్స్ క్రీజులో దుమ్ములేపుతుంటే మరో వైపు మన భారత బౌలర్లు కూడా తగ్గేదే లే అన్నట్లు చెలరేగిపోయారు. ఈ క్రమంలో టీమ్ ఇండియా ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఓ అరుదైన రికార్డును దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి.. కంగారూ జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డుకెక్కాడు. అంతేకాకుండా భారత్‌లో ఎక్కువ సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గానూ చరిత్ర సృష్టించాడు. అయితే గతంలో ఈ రెండు రికార్డులు మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే పేరిట ఉండగా.. ఇప్పుడా రికార్డులను అశ్విన్ బద్దలు కొట్టాడు.
గతంలో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే.. ఆస్ట్రేలియా జట్టుపై 111 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో అశ్విన్.. ఆరు వికెట్లు తీశాడు. దీంతో ఆసీస్‌పై అశ్విన్ తీసిన వికెట్ల సంఖ్య 113కు చేరినట్లైంది. అది కూడా ఆస్ట్రేలియాతో జరిగిన 26 మ్యాచ్‌ల్లో 46 ఇన్నింగ్స్‌ల్లోనే అశ్విన్ ఈ వికెట్లు తీశాడు. అతని బౌలింగ్ సగటు 31.92గా ఉంది. దీన్ని బట్టి ఆస్ట్రేలియాపై అశ్విన్ రికార్డు ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది.
ఇక కుంబ్లే చేసిన మరో రికార్డుపై కూడా అశ్విన్ ఓ కన్నేశాడు. భారత్‌లో అనిల్ కుంబ్లే 115 ఇన్నింగ్స్‌ల్లో 350 వికెట్లు తీయగా.. అశ్విన్ మాత్రం 106 ఇన్నింగ్స్‌ల్లోనే 336 వికెట్లను పడగొట్టాడు. స్వదేశంలో అశ్విన్ మరో 15 వికెట్లు తీస్తే.. ఈ రికార్డు కూడా బద్దలు అవుతుంది.