Art Director Nitin Desai Death : ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ తుదిశ్వాస విడిచారు. మహరాష్ట్రలోని కర్జాత్‌లో ఉన్న ఆయన సొంత స్టూడియోలో విగతజీవిగా కనిపించారు. నితిన్ దేశాయ్.. ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకున్నారని కర్జాత్ ఎమ్మెల్యే మహేశ్ బల్ది తెలిపారు. ఆయన మృతితో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Nitin Desai Suicide : నితిన్ దేశాయ్.. బుధవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలిలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదని చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఓ ఇంటర్వ్యూలో తన మనసులో ఆత్మహత్య ఆలోచనలున్నాయని చెప్పి తన బాధను బయటపెట్టారు. ఇప్పుడు నిజంగా ఆత్మహత్య చేసుకోవడం వల్ల కుటుంబసభ్యులు, స్నేహితులతో పాటు అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు.
Nitin Desai Career : చిత్ర పరిశ్రమలోని నితిన్ దేశాయ్‌కు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్‌గా మంచి పేరు ఉంది. ఆయన తన కెరీర్లో పరిందా, హమ్ దిల్ దే చుకే సనమ్, 1942 - ఎ లవ్ స్టోరీ, రాజుచాచా, రంగీలా, దౌడ్, ఇష్క్, దేవదాస్, హరిశ్చంద్రాస్ ఫ్యాక్టరీ, లగాన్, జోధా అక్బర్ వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. కళాదర్శకత్వానికి చేసిన కృషికి గాను ఆయన.. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో అనేక అవార్డులు అందుకున్నారు.
నితిన్ దేశాయ్.. చివరగా 2019లో విడుదలైన పానిపత్ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆస్కార్ విన్నింగ్ మూవీ స్లమ్‌డాగ్ మిలీయనర్(2008) సినిమాకు సెట్‌ను ఆయనే రూపొందించారు. 2005లో నితిన్ దేశాయ్ కర్జాత్‌లో 52 ఎకరాల్లో.. ND స్టూడియోలను స్థాపించారు. ఈ స్టూడియోలోనే బిగ్‌బాస్ షోలు కూడా జరుగుతున్నాయి. గత నెలలో నితిన్ దేశాయ్ రాబోయే గణేష్ చతుర్థి పండుగ కోసం తన స్టూడియోలో ప్రారంభ పూజను నిర్వహించారు. ముంబయిలోని ప్రముఖ గణేశ్ మండపం... లాల్బాగ్చా రాజా కోసం ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఇంతలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.