అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లను అందుకుని ఫుల్ జోష్ మీదున్నారు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన నటిస్తున్న కొత్త చిత్రం NBK 108. యంగ్ అండ్ ఫన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని బాలయ్యతో పాటు ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. అయితే మూవీటీమ్.. సినిమాకు సంబంధించి ఓ కొత్త అప్డేట్ ఇచ్చింది. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ సినిమాలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఓ ప్రత్యేక వీడియోను కూడా పోస్ట్ చేసింది. 'జాతీయ పురస్కార గ్రహీత, టాలెంటెడ్ ఆర్టిస్ట్ అర్జున్ రాంపాల్‌కు వెల్కమ్! తెలుగులో విలన్‌గా అరంగేట్రం చేయనున్నారు' అని చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ పేర్కొంది. ఇందులో డైరెక్టర్ అనిల్ రావిపూడి-అర్జున్ రాంపాల్ కలిసి ముచ్చటిస్తూ కనిపించారు.
అర్జున్ రాంపాల్ నోట బాలయ్య డైలాగ్.. 'ఫ్లూట్ జింక ముందు ఊదు. సింహం ముందు కాదు'.. బాలకృష్ణ డైలాగ్‌ను.. ఈ వీడియోలో అర్జున్ రాంపాల్ చెప్పడం విశేషం. అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమాలో మంచి డైలాగులు ఉన్నాయని అర్జున్ తెలిపారు. సినిమాలో అవకాశం ఇచ్చినందుకు బాలయ్యకు థాంక్స్ అంటూ నమస్కారం పెట్టారు.