ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకాలు.. రూల్స్ ఏంటంటే..? - ఆన్‌లైన్ టికెట్ ధరలపై ఏపీ సర్కార్ రూల్స్
Movie ticket price in AP : టికెట్ ధరపై సేవారుసుము 2 శాతానికి మించి ఉండకూడదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సినిమా నియమావళి-1970ను ప్రభుత్వం సవరించింది. ఆన్‌లైన్ విధానంలో టికెట్ల విక్రయాలపై ఏపీ సర్కార్ విధివిధానాలు ఖరారు చేసింది.
Movie ticket price in AP : ఏపీలో ఆన్‌లైన్ విధానంలో సినిమా టికెట్ల విక్రయాలను తప్పనిసరి చేస్తూ.. వాటి విధి విధానాల్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సేవా రుసుము టికెట్ ధరపై 2 శాతానికి మించి ఉండకూడదని నిర్దేశించింది. ఆన్‌లైన్ విధానంలో సినిమా టికెట్ల విక్రయానికి సర్వీసు ప్రొవైడర్‌ను నియమించే, నిర్వహణ చేపట్టే బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ)కి అప్పగించింది. ఆ సంస్థే నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ సినిమా నియమావళి-1970ను సవరించింది. దీనికి సంబంధించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్ గుప్తా గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులోని ప్రధానాంశాలు ఇవే..
- ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాల కోసం ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ సర్వీసు ప్రొవైడర్‌ను నియమిస్తుంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్న సంస్థలు, సినిమా థియేటర్లు ఆ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు. అయితే నోడల్ ఏజెన్సీ నియమించిన సర్వీసు ప్రొవైడర్ గేట్‌వే ద్వారానే విక్రయాలు చేపట్టాలి.
- ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాల కోసం రాష్ట్రంలోని సినిమా థియేటర్లన్నీ ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీతో ఒప్పందం కుదుర్చుకోవాలి. సర్వీసు ప్రొవైడర్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానమయ్యేందుకు కావాల్సిన మౌలిక వసతుల్ని థియేటర్ల యాజమాన్యాలే కల్పించుకోవాలి.
- ఈ విధానం అమల్లోకి వచ్చిన 30 రోజుల్లోగా అన్ని థియేటర్లలో నిబంధనలన్నీ పక్కాగా అమలుకావాలి. లేకుంటే వారి లైసెన్సు రద్దవుతుంది.
- సినిమా తొలి ప్రదర్శనకు ఏడు రోజుల ముందు నుంచి మాత్రమే ఆన్‌లైన్ విక్రయాలు ప్రారంభించాలి.
- ప్రతి టికెట్‌పైనా.. జీఎస్టీ, సేవారుసుము ఎంత వసూలు చేస్తున్నారనేది స్పష్టంగా ముద్రించాలి.