Anushka Shetty Marriage News : దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క శెట్టి నటించిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. పి.మహేష్‌బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో సెప్టెంబర్ 7న రిలీజ్ అవ్వనుంది(miss shetty mr polishetty release date). దీంతో కొద్ది రోజులుగా హీరో నవీన్ పొలిశెట్టి ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉండగా.. ఇప్పుడు హీరోయిన్ అనుష్క కూడా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ చిత్ర విశేషాలతో పాటు తన పెళ్లి గురించి కూడా ఆసక్తికర విషయాలను తెలిపింది.
"ఈ చిత్రంలో నా పాత్ర పేరు అన్విత. అందరు అమ్మాయిలా కాకుండా.. ఎంతో ప్రత్యేకం. తన పనులు పూర్తి చేయడం కోసం ఏదైనా చేస్తుంది. మంచి కథల్లో నటించడం ఎంతో సవాల్‌తో కూడుకున్న పని. నా కెరీర్‌లో దేవసేన, జేజమ్మ, భాగమతి లాంటి ఎన్నో స్పెషల్ రోల్స్ చేశాను. ఇప్పుడు అన్విత పాత్ర కూడా అలాంటిదే. ఎంతో భిన్నంగా ఉంటుంది. ఇలాంటి పాత్రలు పోషించడానికి అదృష్టం ఉండాలి. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో యాక్టింగ్‌పై ఎలాంటి అవగాహన లేదు. ఇప్పుడీ స్థాయికి చేరుకున్నానంటే.. దీని వెనక ఎంతో మంది ప్రోత్సాహం ఉంది. ఎన్ని సినిమాలు చేసినా.. మొదటి రోజు సెట్‌కు ఎలా వెళ్లానో ఇప్పుడూ అలానే వెళ్తుంటాను. ఇన్నేళ్ల నా జర్నీలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నాను. ఒక్కోసారి ఎంతో బాగుంటుంది. కానీ ఇంకోసారి ఎంతో కఠినంగా అనిపిస్తుంటుంది. ఆడియెన్స్‌ను ఎప్పుడూ గుర్తుండిపోయే పాత్రలు చేయాలని అనుకుంటుంటాను. " అని అనుష్క చెప్పింది.