Anupama Parameswaran ButterFly Movie OTT: 'అఆ' సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చారు మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. తొలి సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్లో కనిపించి నటిగా వైవిధ్యతను చాటుకున్న అనుపమ.. ఆ తర్వాత నాగచైతన్యతో 'ప్రేమమ్'లో నటించి అభిమానుల్ని సంపాదించుకున్నారు. కెరీర్లో తొలిసారి మహిళా ప్రధాన కథాంశంతో అనుపమ పరమేశ్వరన్ నటించిన చిత్రం 'బటర్ ఫ్లై'. హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి గంటా సతీష్ బాబు దర్శకత్వం వహించారు.
ఓ అపార్ట్మెంట్లో యువతికి ఎదురయ్యే అనూహ్య పరిణామాలతో 'బటర్‌ఫ్లై' సినిమాను రూపొందించారు. షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా.. ఇప్పటివరకు రిలీజ్ డేట్‌పై దర్శకనిర్మాతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డిస్నీ హాట్‌స్టార్ ఓటీటీ సంస్థతో నిర్మాతలు ఇటీవలే ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే 'బటర్ ఫ్లై' రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.
కమల్ 'ఇండియన్ 2' నుంచి కాజల్ ఔట్?.. 'విక్రమ్' సినిమా అద్భుతం విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు విలక్షణ నటుడు కమల్ హాసన్. ఈ ఉత్సాహంతోనే 'ఇండియన్ 2' సినిమాను తిరిగి సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకనిర్మాతలకు మధ్య నెలకొన్న విభేదాల కారణంగా 'ఇండియన్ 2' షూటింగ్ ఏడాది క్రితం నిలిచిపోయింది. ఆగస్టు నెలలో షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.