మంచి కథని ఎంచుకోవడం.. ఇచ్చిన పాత్రకి న్యాయం చేయడం వరకే నా చేతిలో ఉంటుందని చెబుతోంది అను ఇమ్మానుయేల్. చేసిన సినిమాలు ఆడలేదేమో కానీ, నటిగా మాత్రం నేనెప్పుడూ ఓడిపోలేదంటోంది. తొలి అడుగుల్లోనే అగ్ర కథానాయకులతో ఆడిపాడిన అను ఇమ్మానుయేల్.. ఈమధ్య ఆచితూచి సినిమాలు చేస్తోంది. ఇటీవల అల్లు శిరీష్‌తో కలిసి 'ఊర్వశివో రాక్షసివో' అనే చిత్రంలో ఆడిపాడింది. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అను ఇమ్మానుయేల్ బుధవారం విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివే..
"ఒక సినిమా అవకాశం వచ్చిందంటే సహజంగానే హీరో ఎవరు? ఇతరత్రా నటులు, నిర్మాణ సంస్థ తదితర విషయాల్ని ఆరా తీస్తుంటాం. కానీ రెండు మూడేళ్లుగా సినిమా రంగంలో చాలా మార్పులొచ్చాయి. ప్రేక్షకులకి హీరో ఎవరనే విషయం కంటే కూడా, కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కథ బాగుందంటే మిగతా విషయాల్ని పట్టించుకోరు. కొన్ని సినిమాల ఫలితాల్ని చూశాక నటిగా నేనూ కథల ఎంపిక శైలి మార్చుకున్నా. మూస కథలకి దూరంగా ఉంటున్నా. నా దగ్గరికొచ్చిన పాత్రకి నేను సరిపోతానా లేదా అని చూస్తున్నా. నాకు తగ్గ పాత్ర కాదనుకున్నప్పుడు ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నానే తప్ప, ఏదో ఒకటి చేసేద్దాం అని మాత్రం తొందరపడటం లేదు. 'ఊర్వశివో రాక్షసివో' కథ, ఇందులోని సింధు పాత్ర, నిర్మాత అల్లు అరవింద్ మాటలే నన్ను ఈ సినిమా చేయడానికి ప్రేరేపించాయి. పూర్తిస్థాయి నిడివి ఉన్న పాత్రలో కనిపిస్తా".