సూపర్‌హీరో చిత్రాలను అమితంగా ఇష్టపడే వారి మనసు దోచిన సినిమా 'యాంట్-మ్యాన్'. 2015లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించింది. ఆ తర్వాత ఈ సిరీస్‌లో మార్వెల్ స్టూడియోస్ నుంచి 'యాంట్- మ్యాన్ అండ్ ది వాస్ప్' వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా ఈ సిరీస్‌లో ముచ్చటగా మూడో చిత్రంగా 'యాంట్- మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటమేనియా' రాబోతుంది. ఇది ఈ నెల 17న దేశవ్యాప్తంగా విడుదలవుతోంది.
మొదటి.. రెండో చిత్రాల్లో ఏమైంది?
పెటన్ రీడ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కెవిన్ ఫీజ్, స్టీఫెన్ బ్రౌస్సార్డ్ నిర్మించారు. యాంట్-మ్యాన్(2015), యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్(2018)కి సీక్వెల్‌గా అమెరికన్ సూపర్ హీరో పేరుతో మార్వెల్ కామిక్స్ పాత్రలు స్కాట్ లాంగ్, హాంక్ పైమ్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. డారెన్ క్రాస్ వల్ల తన సొంత కంపెనీ నుంచి బలవంతంగా బయటికి వెళ్తాడు డా.హాంక్ పైమ్. అప్పుడు జైలు నుంచి విడుదలైన స్కాట్ లాంగ్ అనే దొంగ పైమ్ దగ్గర శిక్షణ తీసుకొని యాంట్-మ్యాన్ అవుతాడు. మానవాతీత శక్తిని కలిగి ఉండటానికి, చీమల సైన్యాన్ని నియంత్రించే సూట్‌ని ధరిస్తాడు. దీనిని చెడు కోసం ఉపయోగించకుండా కొత్త నైపుణ్యాల కోసం ఉపయోగిస్తాడు. హోప్ వాన్ డైన్, హాంక్ పైమ్‌లు కనిపెట్టిన యాంట్-మ్యాన్ సూట్‌ని స్కాట్లాంగ్ ఒక తండ్రిగా మరోసారి ధరించి కందిరీగతో కలిసి పోరాడతాడు. తరవాత పైమ్, అతని కుమార్తె క్వాంటం రాజ్యానికి వెళ్లడానికి ఒక సొరంగంను కనిపెడతారు.