Ansuhka Shetty Interview : "వినోదం.. భావోద్వేగాలు కలగలిసి ఉన్న కొత్తదనం నిండిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది" అంటున్నారు టాలీవుడ్ బ్యూటీ అనుష్క. ఓ వైపు కమర్షియల్ కథలతో అలరిస్తూనే.. మరోవైపు హీరోయిన్ ఓరియెంటడ్ సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసి ఓ మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు.. నవీన్ పొలిశెట్టితో కలిసి 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాలో మెరిశారు. పి.మహేష్‌బాబు తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో 'ఈనాడు సినిమా'తో ముచ్చటించారు అనుష్క. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న :ఈ మధ్య మీరు సినిమా.. సినిమాకీ చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. సరైన కథలు దొరక్కా లేకుంటే మరేవైనా కారణాలున్నాయా?
అనుష్క : "నిజంగానే ఈసారి నా నుంచి చాలా గ్యాప్ వచ్చింది. 'భాగమతి' తర్వాత ఐదేళ్లకు 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో మళ్లీ థియేటర్లలోకి అడుగు పెడుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. నిజానికి ఈ బ్రేక్‌కు కథలు దొరక్కపోవడం అనేది కారణం కాదు. 'భాగమతి' తర్వాత నేనే కావాలని కొన్నాళ్లు సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాను. అదే సమయంలో 'నిశ్శబ్దం' కథ నా దగ్గరకొచ్చింది. సైలెంట్ ఫిల్మ్.. స్టోరీ డిఫరెంట్‌గా ఉంది.. రెండు నెలల్లో పూర్తయిపోతుంది అని అనుకున్నాను. కానీ, అది ఆలస్యమైంది. అది పూర్తయ్యాక మళ్లీ కొన్నాళ్లు విరామం తీసుకోవాలనిపించింది. ఆ తర్వాత ఈ సినిమాలో నటించాను. ఇకపై ఇంత బ్రేక్ రాకుండా చూసుకుంటాను".
ప్రశ్న :'సైజ్ జీరో' సినిమా కోసం బరువు పెరగడం.. తగ్గడం.. మీ ఆరోగ్యంపై ప్రభావితం చూపించిందనుకోవచ్చా?
అనుష్క : "అలాంటిదేమీ లేదు. 'సైజ్ జీరో' సినిమా 2015లో వచ్చింది. ఆ తర్వాత నేను 'ఓం నమో వేంకటేశాయ', 'బాహుబలి-2', 'భాగమతి'.. ఇలా వరుస సినిమాలు చేశాను కదా. నేను తీసుకున్న బ్రేక్‌కు 'సైజ్ జీరో' ఏమాత్రం కారణం కాదు. నాకు నచ్చి చేసిన పాత్ర అది. ప్రతి దాంట్లోనూ ప్లస్.. మైనస్‌లు ఉంటాయి. అంతకు ముందు నేను కొన్ని సినిమాలు చేసినప్పుడు కూడా చాలా గాయాలయ్యాయి. అవన్నీ వృత్తిలో భాగం. 'భాగమతి' తర్వాత విరామం తీసుకోవడమన్నది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. ఎందుకంటే అంతకు ముందు వరకు వరుసగా చాలా పెద్ద ప్రాజెక్ట్‌లు చేశాను. మానసికంగా.. శారీరకంగా కాస్త విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది. అందుకే తీసుకున్నాను. అంతే తప్ప దీనికి ఏ ఒక్క సినిమా కూడా కారణం కాదు".
ప్రశ్న : 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' కథలో మిమ్మలి ఆకర్షించిన అంశాలేంటి? దీంట్లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
అనుష్క : "కథలో ఉన్న కొత్తదనం నాకు బాగా నచ్చింది. అలాగే నా పాత్రని తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంది. 2019లో నేనీ కథ విన్నాను. విన్న వెంటనే కచ్చితంగా ఇది నేను చేయాలని అనుకున్నాను. అయితే కొవిడ్ కారణంగా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం కాస్త ఆలస్యమైంది. ఇందులో మంచి కామెడీతో పాటు చక్కటి ఎమోషన్స్ ఉన్నాయి. నేనిందులో అన్విత అనే లండన్‌కు చెందిన మాస్టర్ చెఫ్‌గా కనిపిస్తాను. తను బిడ్డను కనాలనుకునే ఆలోచనలో ఓ భావోద్వేగమైన కథ ఉంది. అదేంటన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది".
ప్రశ్న : ఈ సినిమా విషయంలో మీకు సవాల్‌గా అనిపించిన అంశాలేంటి? నవీన్ పొలిశెట్టితో చేయడం ఎలా అనిపించింది?
అనుష్క : "ఇది చాలా సింపుల్ స్టోరీ. పెద్ద డ్రామా ఏమీ ఉండదు. ఇందులో సెటిల్డ్ ఎమోషన్స్ ఉంటాయి. ఇలాంటి కథను భుజానికెత్తుకొని దానికి న్యాయం చేయడం సవాల్‌తో కూడుకొని ఉంటుంది. కానీ, డైరెక్టర్ మహేష్ వల్ల ఈ సవాల్‌ని తేలికగా పూర్తి చేయగలిగాం. స్టోరీ విన్నప్పుడే దీనికి నవీన్ పొలిశెట్టి సరిగ్గా సరిపోతాడనిపించింది. తను ఇందులో అద్భుతంగా నటించాడు. తన కామెడీ టైమింగ్ భలే ఉంటుంది. తనతో కలిసి పని చేయడం చాలా బాగుంది".