పౌరాణిక చిత్రాలంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు నందమూరి తారక రామారావు. రాముడైనా, రావణుడైనా నటించి మెప్పించగల సత్తా ఆయనకే చెల్లింది. ఓ పక్కా కమర్షియల్‌గా సినిమాలు చేస్తూనే.. మరోపక్క పౌరాణిక చిత్రాలను చేస్తుండేవారాయన. అందులో భాగంగా వచ్చిన చిత్రమే 'దానవీరశూరకర్ణ'. ఎన్టీఆర్ నటవిశ్వరూపం ఈ చిత్రంలో చూడొచ్చు. ఈ సినిమా పూర్తిగా ఎన్టీఆర్ శ్రమ ఫలితమనే చెప్పాలి. అప్పటి సినీ రంగంలో తిరుగులేని హీరోగా, ఎంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. 'దానవీరశూరకర్ణ' సినిమాను, స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించి, ఆపైన కర్ణుడిగా, దుర్యోధనుడిగా, కృష్ణుడిగా మూడు పాత్రలు పోషించారు.
'దానవీరశూరకర్ణ'లో కృష్ణుడి పాత్ర చేయనన్న ANR.. ఎందుకో తెలుసా? - danaveerashoorakarna ntr rokles
'దానవీరశూరకర్ణ' సినిమాలో కృష్ణుడు లేదా కర్ణుడి పాత్రలో నటించమని ఏయన్నార్‌ను ఎన్టీఆర్ కోరారట. అయితే ఏయన్నార్.. తాను చేయనని ఓ కారణం చెప్పి సున్నితంగా తిరస్కరించారంట. ఆ కారణం ఏంటంటే?

ఈ సినిమాలో తొలుత కృష్ణుడు లేదా కర్ణుడి పాత్రలో నటించమని ఏయన్నార్‌ను ఎన్టీఆర్ కోరారట. ఎన్టీఆర్‌ను కృష్ణుడిగా చూసిన కళ్లతో తనను జనం చూడలేరనీ, అలాగే తాను కర్ణుడిగా నటిస్తే పాండవులు మరుగుజ్జులుగా కనిపిస్తారని అక్కినేని సున్నితంగా వద్దన్నారట. ఎన్టీఆర్ ఊరుకోలేదు. మర్నాడు ఏయన్నార్‌కు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నుంచి పిలుపు వచ్చింది.
"మీరిద్దరూ కలిసి నటిస్తే జనం తప్పకుండా ఆదరిస్తారు. ఒప్పుకోండి" అన్నారట జలగం. ఎన్టీఆర్‌కు చెప్పిన సమాధానమే ఆయనకూ చెప్పి ఏయన్నార్ అతి కష్టమ్మీద తప్పించుకున్నారట. ఆ చిత్రం తర్వాత కూడా ఎన్టీఆర్ పట్టు విడవలేదు. తర్వాత చిత్రంలో ఏయన్నార్‌ను చాణక్యుడి పాత్రలో చూపించి తన మాట నెగ్గించుకున్నారు ఎన్టీఆర్.