Anni Manchi Sakunamule Review : వైజయంతీ మూవీస్ అనుబంధ సంస్థ స్వప్న సినిమా బ్యానర్‌పై నందిని రెడ్డి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అన్నీ మంచి శకునములే'. యంగ్ హీరో సంతోశ్ సోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా గురువారం థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ప్రీమియర్ షోలు చూసిన అభిమానులు.. ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే ?
ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనరే అయినా చాలా బోరింగ్‌గా ఉందని.. కొన్ని డీసెంట్ కామెడీ సీన్లు, ఫీల్ గుడ్ మూమెంట్స్ మినహా మిగిలిన సినిమా అంతా ల్యాగ్ అనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. ట్విస్ట్‌లను ప్రేక్షకులు సులభంగా ఊహిస్తారని చెబుతున్నారు. మరికొంత మంది.. ఇది పర్ఫెక్ట్ ఓటీటీ మూవీ అని.. అక్కడక్కడ కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయంటున్నారు. పెళ్లి సంప్రదాయాల సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారని వివరించారు. నిర్మాణ విలువలు బాగున్నాయని.. సినిమా మొదట్లో, క్లైమాక్స్ ఆకట్టుకుందని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయంటున్నారు. ఇక, సంతోశ్ సోభన్, మాళవిక నాయర్ పాత్రల్లో ఒదిగిపోయారని చెప్పారు.
టాలీవుడ్లో ఫీల్ గుడ్ సినిమాలకు కేరఫ్ అడ్రస్‌గా నిలిచారు నందిని రెడ్డి. తీసింది కొన్ని సినిమాలే అయినా.. అవి ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమె సినీ కెరీర్ నాచురల్ స్టార్ నానీ, నిత్యా మీనన్ జంటగా నంటించిన 'అలా మొదలైంది'తో ప్రారంభమైంది. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా నంది అవార్డు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత సిద్ధార్థ్, నిత్యా మీనన్, సమంత ప్రధాన పాత్రల్లో 'జబర్దస్త్'ను తెరకెక్కించారు. ఆ తర్వాత నాగశౌర్య, మళవిక నాయర్ జంటగా 'కల్యాణ వైభోగమే' సినిమా తీశారు. ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచింది.
మరో సారి సమంత లీడ్ రోల్లో 'ఓ బేబీ' తెరకెక్కించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. తాజాగా మళ్లీ మాళవికతో రెండోసారి 'అన్నీ మంచి శకునములే' సినిమా తీశారు. నందిని రెడ్డి తీసిన ప్రతి సినిమా ఇంటిల్లిపాదీ అందరూ కలిసి చూడొచ్చు. వల్గర్ కామెడీ, అసభ్యకరమైన సన్నివేశాలు ఈమె సినిమాలో ఉండవు. అన్నీ మంచి శకునములే చిత్రం కూడా క్లీన్ యూ సర్టిఫికేట్ పొందింది.
ఈ మూవీ రిలీజ్‌కు ముందే మరో సినిమా పట్టాలెక్కించారు నందిని. డీజే టిల్లు సినిమాతో సంచలనం సృష్టించిన సిద్ధు జొన్నల గడ్డతో తన తదుపరి సినిమా చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు వచ్చిన కథల కంటే.. ఈ స్టోరీ పూర్తిగా భిన్నంగా ఉంటుందని.. అందులో పెళ్లి, కుటుంబాలు ఉండవు ( నవ్వుతూ) అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.