Annapurna Photo Studio movie trailer : కంటెంట్ ఉంటే చిన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పుడలాంటి మరో సినిమానే ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్ధమై రాబోతుంది. ఆ చిత్రమే 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో'. చందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు, లావణ్య ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్, ప్రోమోలు, సాంగ్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడం వల్ల.. తాజాగా ట్రైలర్‌ను కూడా రిలీజే చేశారు మేకర్స్. ఈ ప్రచార చిత్రం ఆద్యం.. అన్ని రకాల భావోద్వేగాలతో ఆకట్టుకుంటోంది.
"నేడే చూడండి మీ అభిమాన థియేటర్లో అన్నపూర్ణ ఫొటో స్టూడియో. మనస్సుకు హత్తుకునే ప్రేమ కథ, గిలిగింతలు పెట్టే హాస్యం, ఉర్రూతలెక్కించే అందమైన పాటలు, ఉత్కంఠ భరితంగా సాగే కథనం, పోరాటలు, ఉహకందని మలుపులు ఉన్నాయి. ఇవే కాకుండా మరిన్ని ఉన్నాయి" అంటూ ప్రచార చిత్రంలో అన్ని సన్నివేశాలను చాలా బాగా చూపించారు. గ్రామీన నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలోని నటీనటులు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రాన్ని పెళ్లిచూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని వంటి చిత్రాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ నిర్మిస్తోంది. ప్రిన్స్ హెన్రీ స్వరాలు సమకూర్చారు. పంకజ్ తొట్టాడ సినిమాటోగ్రఫీని అందించారు. ఇంకా ఈ చిత్రంలో వైవా రాఘవ, ఉత్తర, లలిత్ ఆదిత్య , మిహిర, ఇతర పాత్రల్లో నటించారు. గోదావరి ప్రాంతంలో జరిగే ఓ చిన్న, ఫన్నీ ప్రేమ కథను.. ప్రధాన కథాంశంగా తీసుకొని సినిమాను తెరకెక్కించారు. జులై 21న ఈ సినిమా విడుదల కానుంది.