Animal Movie Runtime : బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం 'యానిమల్'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ మూవీ రన్‌టైమ్ అంశంపై బాలీవుడ్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. అదే.. సినిమా రన్‌టైమ్‌ను కుదించే విషయంలో అస్సలు వెనక్కి తగ్గట్లేదట దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. సుమారు 3 గంటల 15 నిమిషాల నిడివి ఉన్న ఈ కథను తగ్గించాలని దర్శకుడికి ఎన్నో అభ్యర్థనలు వచ్చాయట. అయితే కుదరని పరిస్థితుల్లో తన స్క్రిప్ట్‌లో ఎటువంటి మార్పులు చేయకుండా యథాతథంగానే స్క్రీన్‌పై పదర్శించేందుకు ఆయన సిద్ధమయ్యారట. తాను అనుకున్న కథను ఏ మార్పులు లేకుండా ప్రేక్షకులకు చూపించాలంటే రన్‌టైమ్ విషయంలో ఏమాత్రం రాజీపడే పసక్తే లేదని సందీప్ తేల్చి చెప్పినట్లు సమాచారం.
ఆ విషయంలో డైరెక్టర్ నో కాంప్రమైజ్..!
ముందుగా 'యానిమల్'ను మూడున్నర గంటల నిడివితో రిలీజ్ చేయాలని అనుకున్నారట మేకర్స్. ఈ క్రమంలో ఇంత ఎక్కువ నిడివ గల సినిమా అంటే థియేటర్స్‌లో వేసే షోస్ టైమింగ్‌తో పాటు ఇతర ఇబ్బందులు కూడా తలెత్తుతాయని కొందరు సూచించారట. దీంతో 210 నిమిషాల రన్‌టైమ్‌లో 15 నిమిషాలు కత్తిరించి చివరకు 3 గంటల 15 నిమిషాలకు సినిమాను కుదించారట డైరెక్టర్. అయితే ఇంత పెద్ద కథను రెండు భాగాలుగా తీసి విడుదల చేద్దామని భావించినా.. అది మరీ సాగదీసినట్లు ఉంటుందని.. అందుకే ఆ ఆలోచనను పక్కకు పెట్టి అనుకున్న స్క్రిప్ట్ ప్రకారమే వెళ్దామని డిసైడ్ అయ్యారట.
రెండు ఇంటర్వెల్స్..
అయితే ఈ మూడు గంటల రన్‌టైమ్ నిర్ణయంతో థియేటర్ యజమానులు తలలు పట్టుకుంటున్నారు. ఇంత లాంగ్ రన్‌టైమ్ సినిమాలను తమ టాకీస్‌లలో ప్రదర్శిస్తే ఆ తర్వాతి షోల టెలికాస్ట్ టైమింగ్ పరంగా, అలాగే స్పెషల్ షోస్ వేసే విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటామని వాపోతున్నారు. ఇక 'యానిమల్' షో-టైమ్‌లో డబుల్ ఇంటర్వెల్స్ కూడా తప్పనిసరిగా మారే పరిస్థితి ఏర్పడింది.