చిత్రం:జయమ్మ పంచాయితీ; నటీనటులు: సుమ, దేవి ప్రసాద్, దినేశ్ కుమార్, షాలిని జోయ్, నిఖిత తదితరులు; సంగీతం: ఎం.ఎం.కీరవాణి; ఎడిటింగ్: రవితేజ గిరిజాల; సినిమాటోగ్రఫీ: అనుష్ కుమార్; నిర్మాత: బాలగ ప్రకాశ్, అమర్-అఖిల్; రచన, దర్శకత్వం: విజయ్ కలివరపు; విడుదల: 06-05-2022
Jayamma Panchayathi Review: వెండితెరకి కొత్త కాకపోయినా... బుల్లితెరతోనే ఇంటింటికీ చేరువయ్యారు సుమ కనకాల. తెలుగు వారి ఇళ్లల్లో ఒకరిలా మారిపోయిన ఆమె... షో నిర్వహించినా లేక సినిమా వేడుకలకి వ్యాఖ్యాతగా వ్యవహరించినా తనవైన ఛమక్కులతో ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంటారు. ప్రేక్షకులే కాదు, సినీ పరిశ్రమ వర్గాలు కూడా ఆమె వాగ్ధాటినీ, సమయస్ఫూర్తిని మెచ్చుకుంటుంటారు. ఇన్నాళ్లూ బుల్లితెరపైనే మెరిసిన సుమ... వెండితెరపైనా సందడి చేయడం కోసం ఇటీవల ‘జయమ్మ పంచాయితీ’లో నటించారు. ఆ సినిమా ఎలా ఉంది? జయమ్మగా సుమ కనకాల మెప్పించారా?
కథేంటంటే: కొంచెం భోళాతనం.. మరికొంచెం జాలిగుణం మొండితనం కలగలసిన మహిళ జయమ్మ (సుమ). ఆమె గురించి తెలిసినవాళ్లు మచ్చ లేని మనసు అంటారు. ఊళ్లో సమస్యలన్నీ తన సమస్యలుగా భావిస్తుంటుంది. పొరుగోళ్లకి సాయం చేయడమంటే ఇష్టం. తిరిగి సాయం చేయకపోతే మాత్రం ఊరుకోదు. ఊరంతా తనదే అనుకునే తత్వం. కుటుంబంతో కలిసి హాయిగా జీవితం గడుపుతుంటుంది. ఇంతలోనే భర్త (దేవీప్రసాద్)కి జబ్బు చేస్తుంది. డబ్బు అవసరమవుతుంది. తనకి ఎదురైన ఈ సమస్య తీరాలంటే పంచాయితీకి వెళ్లాల్సిందే అని నిర్ణయిస్తుంది. కానీ పంచాయితేమో వేరే సమస్యతో తలమునకలై ఉంటుంది. మరి జయమ్మ సమస్యకి పరిష్కారం దొరికిందా? లేదా?అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: శ్రీకాకుళం జిల్లా నేపథ్యంలో సాగే ఓ గ్రామీణ కథ ఇది. పల్లెటూరు అనగానే ఓ ప్రత్యేకమైన జీవన విధానం కనిపిస్తుంది. కల్మషం లేని మనస్తత్వాలు, అమాయకత్వం కలగలిసిన జీవితాలే స్ఫురిస్తాయి. వీటికితోడు మూఢ నమ్మకాలు, అసమానతల వంటి రకరకాల సమస్యలు కనిపిస్తుంటాయి. ఆ వాతావరణాన్ని అత్యంత సహజంగా కళ్లకు కట్టిన చిత్రమిది. ఆరంభ సన్నివేశాల్ని గ్రామీణ వాతావరణాన్ని ఆవిష్కరించడానికి, ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లడానికే వాడుకున్నారు దర్శకుడు. జయమ్మ టైటిల్ సాంగ్ నుంచే అసలు కథ మొదలవుతుంది. జయమ్మ సమస్య, ఆ నేపథ్యంలో సంఘర్షణ పెద్దగా మనసుల్ని తాకకపోయినా ఆమె పంచాయితీకి వెళ్లడంలో నిజాయతీ కనిపిస్తుంది. ముఖ్యంగా సుమ పాత్ర ప్రభావం ఏమాత్రం లేకుండా జయమ్మ పాత్రని డిజైన్ చేసిన విధానం, పల్లెటూళ్లలో కనిపించే సమస్యల్ని ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది.
జయమ్మ సమస్యకి ఊళ్లోని మరికొన్ని కథల్ని ముడిపెట్టిన తీరు, వాటిని నడిపించిన విధానం, పాత్రల నుంచే సునిశితమైన హాస్యం పండించిన వైనం మెప్పిస్తుంది. అక్కడక్కడా సినిమా సాగదీతగా అనిపించినా... కథలో నిజాయతీ మాత్రం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ద్వితీయార్ధంలో భావోద్వేగాలపై దృష్టిపెట్టిన దర్శకుడు ఆ విషయంలో కొంత మేర సఫలమయ్యారు. జయమ్మ పాత్రకి సుమ పరిపూర్ణంగా న్యాయం చేశారు. ఈడ్లు కోసం ఆమె చేసే హంగామా, తనకి సమస్య వచ్చినప్పుడు ఆదుకోవాల్సిందే అని పంచాయితీలో వాదించే వైనం మనసుల్ని హత్తుకుంటుంది. శ్రీకాకుళం నేపథ్యాన్ని ఆవిష్కరించిన తీరు సినిమాకి హైలైట్‌గా నిలిచింది. పాత్రల మధ్య సంఘర్షణ, భావోద్వేగాలపై దర్శకుడు చేసిన కసరత్తులు చాలలేదు. ఓ పల్లెటూరి డ్రామాని పరిపూర్ణంగా ఆవిష్కరించే ప్రయత్నం మాత్ర మెప్పించేదే.