తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నా పేరుకు, డ్రెస్సింగ్ స్టైల్​కు సంబంధమే లేదు.. ఆ తర్వాతే నాకు బుద్ధి వచ్చింది!' - అనసూయ సినిమాలు

ఆకట్టుకునే అందం, అంతకు మించిన వాక్చాతుర్యంతో తెలుగింటి ఆడపడుచులా మారిపోయింది అనసూయ భరద్వాజ్‌. ఓవైపు యాంకర్‌గా బుల్లితెరలో హవా కొనసాగిస్తూనే.. మరో వైపు 'రంగమ్మత్త', 'దాక్షాయని' లాంటి పాత్రలతో సిల్వర్‌ స్ర్కీన్ పైనా సత్తా చాటుతోందీ ముద్దుగుమ్మ. తెలుగు నాట సినిమా స్టార్స్‌తో సమానంగా క్రేజ్‌ సొంతం చేసుకున్న ఈ అందాల తార ప్రస్తుతం తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇలా తన అందం, అభినయంతో బుల్లితెర, వెండితెర ప్రేక్షకులను అలరిస్తోన్న అనసూయ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి..

అనసూయ భరద్వాజ్
అనసూయ భరద్వాజ్

By

Published : Jul 21, 2022, 11:32 AM IST

Updated : Jul 21, 2022, 3:13 PM IST

అనసూయ

అనసూయ.. యాంకర్​గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటు బుల్లితెర, అటు సినిమాల్లోనూ వరుస అవకాశాలతో బిజీగా గడుపుతోంది. 'పుష్ప'లో దాక్షాయనిగా మెప్పించిన అనసూయ తాజాగా 'దర్జా' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రంలో ఆమె కనకమహాలక్ష్మీ అనే పాత్రలో నటించింది. ఈ సందర్భంగా అందం, అభినయంతో మెప్పిస్తున్న అనసూయ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

అలా అనసూయగా మారిపోయింది!
అనసూయ సొంత ఊరు నల్గొండ జిల్లా భూదాన్‌ పోచంపల్లి. మొత్తం ముగ్గురి ఆడపిల్లల్లో తనే పెద్ద. అనసూయ పుట్టిన తర్వాత వాళ్ల అమ్మ మొదటిగా తనకు ‘పవిత్ర’ అని పేరు పెట్టాలనుకుందట. కానీ తండ్రి మాత్రం వాళ్లమ్మ పేరే పెట్టాలని పట్టుబట్టారు. దీంతో ఫైనల్‌గా అనసూయనే ఫిక్స్‌ చేశారట.

అమ్మ మిషన్‌ కుట్టి స్కూల్‌ ఫీజు కట్టింది!
మొదట్లో ఆర్థికంగా స్థితిమంతులైన అనసూయ కుటుంబం కొన్ని కారణాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకు కారణం ఆమె తండ్రికున్న గుర్రపు పందేల వ్యసనం. 'నా చిన్నప్పుడు మేము ఆర్థికంగా స్థితిమంతులమే. ముగ్గురం ఆడపిల్లలమే అవడంతో సమాజంలో ఎలా ఉండాలి? ఎవరితో ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలను నాన్నే మాకు నేర్పించారు. అయితే ఆయనకు గుర్రపు పందేల వ్యసనం ఉండేది. దీంతో మేం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్నేళ్ల పాటు అద్దె ఇంట్లో జీవించాం. కొన్ని సందర్భాల్లో అద్దె కట్టేందుకు కూడా డబ్బులు ఉండేవి కావు. అమ్మ మిషన్‌ కుట్టి మా స్కూల్‌ ఫీజులు కట్టేది. రూ.50 పైసలు మిగులుతుందని రెండు స్టాపులు నడుచుకుంటూ వెళ్లి బస్సు ఎక్కేదాన్ని' అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ 'జబర్దస్త్‌' బ్యూటీ.

జబర్దస్త్​తో..
ఎంబీఏ పూర్తి చేసిన అనసూయ.. చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం ఒక కంపెనీలో హెచ్.ఆర్. విభాగంలో పని చేసింది. ఆ తర్వాత ఒక న్యూస్ ఛానల్‌లో ఒక షోకి హోస్ట్‌గా పని చేసింది. అప్పటికీ తనకు తెలుగులో మాట్లాడడం అంత క్షుణ్ణంగా రాదు. షో మధ్యలో ఆంగ్ల పదాలు దొర్లుతుండేవి. కానీ.. అప్పట్లో చాలామంది వీక్షకులకు తను మాట్లాడే విధానం నచ్చడంతో కొంతకాలం హోస్ట్‌గానే కొనసాగింది. ఈ సమయంలోనే ఓ టాక్ షోకు యాంకర్‌గా పని చేసిన అనసూయ.. పలు ప్రముఖ టీవీ ఛానళ్లలో వీడియో జాకీగా కూడా మెప్పించింది. ఆ సమయంలోనే ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ కార్యక్రమంలో అనసూయకు యాంకర్‌గా అవకాశం లభించింది. ఈ కార్యక్రమంతో తను మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ షో ద్వారా తెలుగులో ఉన్న టాప్ యాంకర్ల జాబితాలో ఒకరిగా పేరు సంపాదించుకుంది అనసూయ.

మొదట సినిమా ఛాన్స్​ అలా..!
అనసూయ అటు యాంకర్‌గా మాత్రమే కాదు.. ఇటు యాక్టర్‌గా కూడా ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేస్తోంది. ఆమె మొదటిసారి వెండితెరపై 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంలో కనిపించిందని చాలామంది అనుకుంటారు. కానీ అనసూయ 2003లో విడుదలైన 'నాగ' అనే చిత్రంతో మొదటిసారి కెమెరా ముందుకొచ్చింది. ఈ విషయం గురించి ఓ సందర్భంలో ప్రస్తావిస్తూ- 'నాకప్పుడు పదహారేళ్లు ఉంటాయి. కాలేజ్ బంక్ కొట్టి ఫ్రెండ్స్‌తో సినిమాకు వెళ్దామని అందరం ఒకచోట కలిశాం. అనుకోకుండా అక్కడ 'నాగ' సినిమా షూటింగ్ జరుగుతోంది. అందరితో పాటు నేను కూడా షూటింగ్ చూడడానికి అక్కడికి వెళ్లాను. అప్పుడు అక్కడ జరుగుతోన్న సీన్‌లో కాలేజీ అమ్మాయి వేషం కోసం వెతుకుతున్నారు. అదే సమయంలో నన్ను చూసిన సహాయ దర్శకుడు నన్ను చూసి 'నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. వూరికే అలా నిలబడితే చాలు..!' అని నన్ను తీసుకెళ్లి సునీల్ (నటుడు) వెనుక నిలబెట్టాడు. నాకు ఆరోజు రూ. 500 ఇచ్చారు. నా జీవితంలో అదొక మర్చిపోలేని సంఘటన..!' అని చెప్పింది.

సుశాంక్‌తో అలా పరిచయం!
అనసూయ ఆర్మీలో పని చేయాలని తన తండ్రి కోరుకునేవారు. అందుకోసమే స్కూల్‌లో ఉన్నప్పుడు తనను ఎన్‌సీసీలో చేర్పించారు. ఆ సమయంలోనే అనసూయకు సుశాంక్ భరద్వాజ్ (తన భర్త)తో పరిచయం ఏర్పడింది. 'ఇంటర్‌లో ఉన్నప్పుడు ఎన్‌సీసీ పరేడ్‌ కోసం దిల్లీ వెళ్లాను. అక్కడే నాకు సుశాంక్‌ భరద్వాజ్‌తో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల్లోనే నేనంటే ఇష్టమని చెప్పాడు. అప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా మా మధ్య స్నేహం అలానే కొనసాగింది. ఇక మా ప్రేమ విషయం ఇంట్లో తెలిసి నాన్న పెద్ద గొడవే చేశారు. వేరే సంబంధాలు కూడా చూశారు. "నేను సుశాంక్‌నే పెళ్లి చేసుకుంటా. లేకపోతే అస్సలు పెళ్లే చేసుకోను’ అని ఇంట్లో గట్టిగా చెప్పేశాను. అలా తొమ్మిదేళ్ల పాటు ప్రేమ పోరాటం చేసి చివరికి 2010లో మేమిద్దరం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాం. మా ప్రేమ బంధానికి ప్రతీకే మా ఇద్దరు పిల్లలు శౌర్య, అయాన్స్‌' అని చెప్పుకొచ్చిందీ సొగసరి.

'ఆ హక్కు ఎవరికీ లేదు'
వృత్తిపరంగా బిజీగా ఉండే అనసూయ.. సమాజంలో తనకు నచ్చని విషయాల గురించి సోషల్ మీడియా ద్వారా తరచూ స్పందిస్తుంటుంది. ఈ క్రమంలో ఒక్కోసారి ఆమె నెటిజన్ల నుంచి ఎన్నో రకాల విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. ముఖ్యంగా తన డ్రస్సింగ్ విషయంలో నెటిజన్లు ఆమెను చాలాసార్లు విమర్శించారు. పిల్లలతో కలిసి చూసే టీవీ కార్యక్రమాల్లో కూడా పొట్టి డ్రస్‌లు వేసుకొని స్కిన్ షో చేస్తూ కనిపించడం ఎంతవరకు సరైందని ఆమెను సోషల్ మీడియా ద్వారా చాలామంది ప్రశ్నించారు. వీటిపై పలుసార్లు స్పందించిన అనసూయ 'సమాజంలో ఆడవాళ్లు ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి, ఇలానే నడుచుకోవాలి.. అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. మగవారికి ఉన్నట్లే మహిళలకూ అన్ని విషయాల్లో సమాన హక్కులున్నాయి. వారిని తమకు నచ్చిన విధంగా బతకనివ్వండి. మీ పాత కాలం సిద్ధాంతాలను మాపై, ముందు తరాలపై దయచేసి రుద్దకండి..!' అని సమాధానమిచ్చింది.

ఇవీ చూడండి :

Last Updated : Jul 21, 2022, 3:13 PM IST

ABOUT THE AUTHOR

...view details