తనపై వస్తున్న ఫేక్ న్యూస్‌లను కట్టడి చేసేందుకు దిల్లీ కోర్టును ఆశ్రయించిన బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనమరాలు, అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య బచ్చన్‌కు ఊరట లభించింది. ఆరాధ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు.. గూగుల్ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ఐటీ నిబంధనలను కట్టుబడి ఉండాలని ఆదేశించింది. అన్ని నిబంధనలను పాటించాలని నోటీసులు జారీ చేసింది.
దిల్లీకి చెందిన పలు యూట్యూబ్ ఛానళ్లతో పాటు, టాబ్లాయిడ్లు గత కొద్ది రోజులుగా ఆరాధ్య బచ్చన్ గురించి వరుస కథనాలు ప్రచురిస్తూ వస్తున్నాయి. వాటన్నింటిలోనూ వాస్తవాల కంటే ఊహాగానాలకే ఎక్కువ ఉన్నాయని.. అంతే కాకుండా తన ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత జీవితం గురించి పలు కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు.. ఇలాంటి తప్పుడు వార్తలను జనాల్లోకి తీసుకెళ్తున్న సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో చిన్నారి ఆరాధ్య చేత దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. తన ఆరోగ్యంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన యూట్యూబ్, టాబ్లాయిడ్‌లపై దిల్లీ హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. మైనర్ అయినందున.. తనపై ఇలాంటి మీడియా కవరేజీపై నిషేధం విధించాలని అభ్యర్థించింది. ఆరాధ్యకు సంబంధించిన అన్ని వీడియోలను తొలగించాలంటూ.. పది సంస్థల పేర్లను ఆమె పిటిషన్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పుడు గూగుల్ LLCతో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (గ్రీవెన్స్ సెల్)ల పేర్లు కూడా ఉన్నాయి.