Amitabh Bachchan Rajinikanth Movie : రజనీకాంత్, అమితాబ్ బచ్చన్.. భారత చిత్ర పరిశ్రమలోఇద్దరూ లెజెండ్స్! ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని చెప్పడానికి వీలు లేదు! రజనీకాంత్ తమిళ సినిమాలే ఎక్కువగా చేశారు. మధ్య మధ్యలో తెలుగు, హిందీ సినిమాల్లో కనిపించారు. కానీ ఆయనకు దేశమంతా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు మిగతా భాషల్లో అనువాదం అవుతూ ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ హిందీ సినిమాలు ఎక్కువ చేసినా ఆయనకు కూడా నేషనల్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారని కోలీవుడ్ టాక్.
తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్!
సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇద్దరూ మంచి స్నేహితులు. కెరీర్ తొలినాళ్లలో ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు ఉన్నాయి. 'అంధా కానూన్', 'గేరేఫ్తార్', 'హమ్'లో ఇద్దరు లెజెండ్స్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మళ్లీ 32 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని వినికిడి.
కీలక పాత్రలో బిగ్ బి
నయనతార 'కోలమావు కోకిల', శివ కార్తికేయన్ 'డాక్టర్', విజయ్ 'మాస్టర్' తర్వాత దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న సినిమా 'జైలర్'. ఇందులో హీరోగా నటిస్తున్నారు సూపర్ స్టార్ రజనీ. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'లాల్ సలాం'లో కూడా రజనీకాంత్ నటిస్తున్నారు. అయితే, అందులో ఆయనది అతిథి పాత్రే. ఆ సినిమా తర్వాత సూర్య కథానాయకుడిగా 'జై భీమ్' వంటి క్లాసిక్ తీసిన టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అందులో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర చేస్తారని తెలిసింది.