ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ట్రాఫిక్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇక ఆఫీస్ టైమింగ్స్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రాఫిక్‌లో చిక్కుకున్నామంటే చాలు.. గంటలు తరబడి వెయిట్ చేయాల్సిందే. ఎంత అర్జెంట్ పని ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. చాలా సార్లు హీరోహీరోయిన్లకు, నటీనటులకు కూడా ఆ బాధ తప్పడం లేదు. షూటింగ్ సెట్‌కు వెళ్లాల్సిన సమయం దగ్గరపడుతున్నా.. ట్రాఫిక్ తగ్గకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. తమ కార్లలోనే వెయిట్ చేస్తున్నారు.
ఇటీవలే ముంబయి నగరంలో భారీ ట్రాఫిక్ నుంచి తప్పించుకునేందుకు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, స్టార్ హీరోయిన్, క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ.. షూటింగ్‌కు టైమ్ అయిపోతుందని తమ కార్లు వదిలి బైక్‌పై ప్రయాణించారు. వేగంగా తమ షూటింగ్ సెట్లకు చేరుకునేందుకు వేర్వేరు సందర్భాల్లో వారు ఇతరుల బైక్‌ను ఆశ్రయించారు. అయితే వారిద్దరికి లిఫ్ట్ ఇచ్చిన ఇద్దరు బైకర్లకు ముంబయి పోలీసులు షాక్ ఇచ్చారు. ఫైన్ విధించారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా హెల్మెట్లు ధరించకపోవడం వల్ల ట్రాఫిక్ విభాగం జరిమానాలు విధించింది.
అమితాబ్, అనుష్కకు లిఫ్ట్.. బైకర్లకు పోలీసులు షాక్.. రూ.10 వేలు కట్టాలంటూ! ఇటీవల అమితాబ్ బచ్చన్.. ఓ సామాన్యుడి బైక్‌పై షూటింగ్ స్థలానికి వెళ్తూ ముంబయి వీధుల్లో కనిపించారు. తనకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి నెట్టింట స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. "నువ్వు ఎవరో నాకు తెలీదు.. కానీ సమయానికి నన్ను షూటింగ్ జరిగే ప్రదేశానికి తీసుకెళ్లావు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోకుండా సాయం చేశావు" అంటూ అతడికి అమితాబ్ ధన్యవాదాలు చెప్పారు. ఇదే విధంగా అనుష్క కూడా కారులో స్టూడియో వెళ్తుంటే.. చెట్టు పడిపోవడం వల్ల దారి అంతా ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో ఆమె కూడా ఓ వ్యక్తి బండి మీద స్టూడియోకు చేరుకున్నారు.
అయితే ఈ రెండు సంఘటనలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. పని పట్ల వీరికున్న నిబద్ధతను కొందరు ప్రశంసించారు. కానీ మరికొందరు మాత్రం బైకర్లు.. హెల్మెట్లు ధరించలేదని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ఈ విషయాన్ని ముంబయి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు స్పందించారు. ఈ విషయాన్ని ట్రాఫిక్ విభాగానికి తెలియజేస్తామని చెప్పారు.
ఇప్పుడు ముంబయి ట్రాఫిక్ పోలీసు విభాగం రంగంలోకి దిగింది. అమితాబ్, అనుష్కకు లిఫ్ట్ ఇచ్చిన ఆ బైకర్లకు జారీ చేసిన చలాన్లను ట్విటర్ వేదికగా షేర్ చేసింది. అనుష్కకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి రూ.10,500 చలానా విధించింది. అమితాబ్‌ను తీసుకెళ్లిన వ్యక్తిపై జరిమానా పడింది. అయితే ఆ మొత్తంపై స్పష్టత లేదు.