బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ మంగళవారం తన 80వ పుట్టినరోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే బిగ్‌బీ బర్త్‌డే సందర్భంగా ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగ కరోడ్ పతి' షోలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అమితాబ్‌ను సర్‌ప్రైజ్ చేసేందుకు తల్లితో కలిసి ఆయన తనయుడు, హీరో అభిషేక్ బచ్చన్ షోకు సడెన్ ఎంట్రీ ఇచ్చారు.
షో జరుగుతుండగా ఒక్కసారిగా సైరన్ మోగడం.. అదేంటి షో అయిపోయిందా? అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్న తరుణంలో అభిషేక్ సడెన్ ఎంట్రీతో బిగ్‌బీని సర్‌ప్రైజ్ చేశారు. తనయుడి రాకతో అమితాబ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. అనంతరం తండ్రిని హాట్ సీట్‌లో కూర్చోబెట్టి, హోస్ట్ సీట్‌లో తాను కూర్చోని బిగ్‌బీతో ముచ్చటించారు అభిషేక్. ఈ సందర్భంగా బిగ్‌బీ.. అభిషేక్‌కు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.