Amazon Prime: కరోనా తర్వాత ఓటీటీలో వినియోగంలో పెనుమార్పులు వచ్చాయి. ముఖ్యంగా సినిమాలను తలదన్నేలా వెబ్ సిరీస్‌లు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో సరికొత్త సిరీస్‌లతో అలరించేందుకు సిద్ధమైంది. రాబోయే రెండేళ్లలో దాదాపు 40 ఒరిజినల్ సిరీస్‌లు/చిత్రాలను ప్రేక్షకులకు అందించనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న కొన్ని వెబ్ సిరీస్‌ల వివరాలను వెల్లడించింది. తెలుగు, తమిళ, హిందీ సహా వివిధ భాషల్లో, ఈ వెబ్ సిరీస్‌లు, సినిమాలు నిర్మించనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది.
నిఖిల్ అడ్వాణీ ఎమ్మీ ఎంటర్‌టైన్‌మెంట్, కరణ్‌జోహార్ ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్, రితేశ్ సిద్వానీ- ఫర్హాన్ అక్తర్‌లకు చెందిన ఎక్సెల్‌మీడియా, రాజ్ అండ్ డీకే ఫిల్మ్స్ ఇలా పలు నిర్మాణ సంస్థలతో కలిసి ఈ సినిమా సిరీస్‌లు తెరకెక్కిస్తున్నట్లు తెలిపింది. మొత్తం 22 ఒరిజినల్ స్క్రిప్టెడ్ సిరీస్, 9 రిటర్నింగ్ సిరీస్, మూడు అమెజాన్ ఒరిజినల్ ఫిల్మ్స్, రెండు కో-ప్రొడక్షన్స్ ఇందులో ఉన్నాయి.
గతేడాది ప్రైమ్ వీడియో ఛానళ్లను ప్రారంభించగా, ఇప్పుడు అమెజాన్‌ప్రైమ్ వీడియో మరో ముందడుగు వేసింది. 'ట్రాన్సక్షనల్ వీడియో ఆన్ డిమాండ్' (టీవీఓడీ)పేరుతో సినిమాలను అద్దె ప్రాతిపదికన నెటిజన్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రైమ్ మెంబర్స్ కాని సభ్యులు టీవీఓడీ సేవలను పొందవచ్చు. ప్రస్తుతం కొన్ని స్ట్రీమింగ్ యాప్‌లు పేపర్ వ్యూ పద్ధతిలో సినిమాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. జీ5 ఇప్పటికే టీవీఓడీని 'జీప్లెక్స్' పేరిట అందుబాటులోకి తెచ్చింది.