పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ - సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ యాక్షన్ చిత్రం 'OG'. ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో హరీశ్ శంకర్, శ్రీవాస్, వివేక్ ఆత్రేయ, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, ఏఎం రత్నం తదితరులు పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా.. సురేశ్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. దిల్‌రాజు, అరవింద్ దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ అందించారు.
అయితే గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు ఓ కొత్త ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాకు అసలైన ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అల్లు అరవింద్ అనే అనుమానం మొదలైంది. ఎందుకంటే.. అధికారికంగా ఈ చిత్రాన్ని డీవీవీ నిర్మిస్తున్నప్పటికీ.. ఇందులో అరవింద్ కూడా భాగస్వామ్యమయ్యారని సమాచారం. ఆయన వెనక నుంచి సైలెంట్‌గా చిత్రంలో పెట్టుబడులు పెట్టారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని అల్లు స్డూడియోస్‌లో చిత్రీకరించనున్నారట. ఇక సినిమా రిలీజ్‌కు సంబంధించిన పనులను ఆయనే చూసుకోబోతున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియదుగానీ ప్రస్తుతం పలు కథనాలు వస్తున్నాయి. మరో విషయమేమిటంటే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తారని సమాచారం అందుతోంది. తొలి భాగాన్ని త్వరగా పూర్తి చేసి ఈ దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ తొలి భాగంలో ఓ టెర్రిఫిక్ క్లైమాక్స్‌ను ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అదే ఈ చిత్రానికి హైలైట్ కానుందట.