"ఆర్‌ఆర్‌ఆర్ లాంటి అత్యద్భుత సాంకేతిక విలువలున్న చిత్రాల్ని దక్షిణాది నుంచి ప్రపంచానికి అందిస్తున్నాం. ఇలాంటి ప్రయోగాలు చేయాలన్నా.. ప్రపంచ స్థాయి సినిమాలు తీయాలన్నా టికెట్ ధరలు ఎక్కువ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అయితే ఇవే ధరల్ని చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలకు ఆపాదిస్తే నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి నిర్మాతలే తమ చిత్రాల్ని జాగ్రత్తగా వర్గీకరించుకొని.. ధరల విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలి. ఎక్కువ ఆదాయం వస్తుందని ఇష్టారీతిన ధరలు ఖరారు చేసుకుంటూ వెళ్తే.. భవిష్యత్తులో థియేటర్ వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది" అన్నారు నిర్మాత బన్నీ వాస్. జీఏ2 సినిమా పతాకంపై వైవిధ్యభరితమైన చిత్రాల్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 'పక్కా కమర్షియల్'తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటించిన చిత్రమిది. మారుతి తెరకెక్కించారు. జులై 1న విడుదల కానుంది. శనివారం బన్నీ వాస్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలోనే ఆయన విలేకర్లతో ముచ్చటించారు.
ఈ పుట్టిన రోజుకు కొత్తగా ఎంచుకున్న లక్ష్యాలేంటి?
"కొవిడ్ వల్ల నష్టపోయిన ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మూడేళ్లుగా సెట్స్‌పై ఉన్న పెద్ద చిత్రాలన్నీ వరుసగా బాక్సాఫీస్ ముందుకొచ్చేశాయి. మీడియం బడ్జెట్ చిత్రాలు విడుదల చేసుకోవడానికి ఇప్పుడు కాస్త గ్యాప్ దొరికింది. అందుకే మా బ్యానర్ సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాం. జులై 1న వచ్చే 'పక్కా కమర్షియల్'తో మొదలుపెట్టి.. అక్టోబర్ నెలాఖరు నాటికి అన్ని చిత్రాలు విడుదల చేసేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. '18 పేజెస్'ను సెప్టెంబర్ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రమిది. కిరణ్ అబ్బవరంతో చేస్తున్న 'వినరో భాగ్యము విష్ణుకథ' చిత్రాన్ని సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామనుకుంటున్నాం. అల్లు శిరీష్‌తో చేస్తున్న సినిమాని ఆగస్ట్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం".
ఇంతకీ 'పక్కా కమర్షియల్' ఎలా ఉంటుంది?
"టైటిల్‌కు తగ్గట్లుగానే ఇది పక్కా ఎంటర్‌టైనర్. మామూలుగా గోపీచంద్ సినిమాలు కాస్త యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి. దీంట్లో యాక్షన్‌తో పాటు మారుతి శైలి వినోదాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో గోపీచంద్, రాశి ఖన్నా పాత్రలు, వాళ్ల కామెడీ టైమింగ్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. బరువైన భావోద్వేగాలు, భారీ డ్రామాలు ఎక్కడా కనిపించవు."
ప్రస్తుతం ప్రతి సినిమా చాలా త్వరగా ఓటీటీలోకి వచ్చేస్తుంది. మీ బ్యానర్ నుంచి వచ్చే చిత్రాల విషయంలో ఏమైనా పరిమితులు పెట్టుకున్నారా?
"మా జీఏ2 సంస్థ నుంచి వచ్చిన ఏ చిత్రాన్నీ 35రోజుల్లోపు ఓటీటీలో విడుదల చేసింది లేదు. రాబోయే రోజుల్లో ఈ గ్యాప్‌ను మరింత పెంచాలని చూస్తున్నాం. ఈ అంశంపై మిగిలిన చిత్ర నిర్మాతల్లోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మా సంస్థలో నిర్మితమవుతున్నవి ఎక్కువ ఎంటర్‌టైనర్లే. వాటిని ఇంట్లో కూర్చొని చూస్తే నవ్వు రాదు. అందుకే వీలైనంత ఎక్కువ గ్యాప్ తర్వాత ఓటీటీలోకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం హిందీలో థియేట్రికల్ రిలీజ్‌కు ఓటీటీ విడుదలకు మధ్య కనీసం 8వారాల గ్యాప్ ఉండాలని నిబంధన పెట్టుకున్నారు. ఇది జులై నుంచి అమల్లోకి రానున్నట్లుంది. అలాగే దక్షిణాదిలోనూ దీనిపై ఎగ్జిబిటర్లతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఇక్కడా ఓటీటీ విడుదలలకు సంబంధించి కొన్ని ప్రత్యేక నిబంధనలు రావొచ్చని అర్థమవుతోంది".