"హారర్ థ్రిల్లర్ సినిమాలైతే తప్ప... హాస్యం లేకుండా తెలుగు ప్రేక్షకుడికి కథ చెప్పకూడదు. మాతృకలో లేని వినోదాన్ని మేం ప్రత్యేకంగా మేళవించి చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది" అన్నారు అల్లు శిరీష్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఊర్వశివో రాక్షసివో' . తమిళంలో విజయవంతమైన 'ప్యార్ ప్రేమ కాదల్'కు రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. రాకేష్ శశి దర్శకత్వం వహించారు. చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా అల్లు శిరీష్ శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
"కథ బాగా ప్రేరేపిస్తే తప్ప నేను సినిమా చేయను. సినిమా సినిమాకీ మధ్య విరామం రావడానికి కారణం అదే. రాకేష్ శశి, నేను కలిసి సినిమా చేయడం కోసం రెండు మూడుసార్లు కథాచర్చలు కూడా జరిగాయి. కానీ ఆ కథలు కుదరలేదు. 'ఊర్వశివో రాక్షసివో' పట్టాలెక్కడానికి కారణం మా నాన్న. 'ప్యార్ ప్రేమ కాదల్' ఆయనకి బాగా నచ్చింది.
ఇప్పుడు యువతరం ఇలాగే ఉంటుంది కదా, ఈ కాన్సెప్ట్ చాలా బాగుందంటూ సినిమా గురించి పదే పదే చెప్పేవారు. నీకు బాగుంటుందని కూడా నాతో అన్నారు. దాంతో ఆ సినిమాని చూశా. సినిమా చూసినవాళ్లంతా నవ్వుకున్నాం, బాగుందంటూ మెచ్చుకోవడం సంతృప్తినిచ్చింది".
"మధ్య తరగతి కుటుంబానికి చెందిన శ్రీకుమార్ అనే యువకుడి పాత్రలో ఒదిగిపోయావని అభినందిస్తున్నారంతా. అయితే ఆ పాత్ర చేయడానికి తెలుగులో చాలామంది యువ హీరోలే కనిపిస్తారు, కానీ సింధూజ పాత్రలో మాత్రం అను ఇమ్మాన్యుయేల్‌ని తప్ప మరొకరిని ఊహించలేం. తన పాత్రలాగే స్వతంత్య్ర భావాలు, మొండితనం ఉన్న అమ్మాయి తను. అందుకే పాత్రలో అంతగా ఒదిగిపోయిందేమో. మా నాన్న కూడా సినిమా చూశాక అను నటనని మెచ్చుకున్నారు.
'నా పేరు సూర్య...' సమయంలో కానీ, అంతకుముందు కానీ ఎప్పుడూ ఇంత అందంగా కనిపించలేదు, ఇందులో చాలా బాగుందన్నారు. శ్రీ కుమార్ పాత్ర విషయంలోనైనా, అనుతో కెమిస్ట్రీ పండటంలోనైనా సెట్స్‌కి వెళ్లడానికి ముందు మేం చేసిన ముందస్తు సన్నాహాలే. అమాయకమైన కుర్రాడిగా నటించాలన్నప్పుడు ఆ తరహా పాత్రల్ని చూడటం కాకుండా, నిజ జీవితంలోని వ్యక్తుల్ని గమనించి చేయాలనుకున్నా. ఆ పాత్రలాగే మా కజిన్ ఒకరుంటారు. తనకి తెలియకుండానే వీడియోలు తీసి అందుకు తగ్గట్టుగా నటించా".